నవ గ్రహాలలో కుజుడు ఒక శక్తివంతమైన గ్రహం. కుజుడు ధైర్యం, శక్తి, ఉత్సాహం, సమరభావం వంటి గుణాలను కలిగిస్తారని భావిస్తారు. అయితే, ఈ గ్రహం బలహీనంగా ఉంటే లేదా కుజదోషం (Kuja Dosha) ఉంటే.. వ్యక్తి జీవితంలో వివాహ ఆలస్యాలు, కుటుంబ సమస్యలు, ఉద్వేగం, గొడవలు వంటి ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశం పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం జ్యోతిష్య శాస్త్రం పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్కంద పురాణం ప్రకారం, కుజుడు.. భూదేవి, పరమేశ్వరుని సంతానం. శివుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుంచి కారిన స్వేద బిందువు భూమిపై పడుతుంది. భూమి ఆ స్వేద బిందువును గ్రహించి గర్భవతిగా అవుతుంది. ఆ గర్భం నుంచి జన్మించినవాడు కుజుడు.
కుజుడి స్వరూపం, లక్షణాలు
ఎరుపు రంగు, శక్తి
కుజుడు ఎర్రటి వర్ణంతో, దృఢమైన శరీరంతో అత్యంత శక్తివంతుడు. కుజుడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు కుజుడిని నవగ్రహాలలో ఒక గ్రహంగా నియమిస్తారు.
కుజుడు దయామయుడు
కుజుడు ఎంతో దయామయుడు. భక్తి చూపినవారికి అధికారం, సంపద, భూమి, ధనం, విజయం ఇస్తాడు. కుజుడి అనుగ్రహం పొందిన వారు సౌభాగ్యం, విజయంలో భాగ్యశాలి అవుతారు.
కుజుడు అనుకూలంగా లేకపోతే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. కుజుడి స్థానంలో మార్పు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. ఉన్నత స్థానంలో ఉంటే అధికారం, సంపద, విజయం కలుగుతాయి. నీచ స్థానంలో ఉంటే వివాహ ఆలస్యం, రుణబాధ, ఆర్థిక ఇబ్బందులు, సంతానం సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల, కుజుడు బలహీనంగా ఉంటే పరిహారాలు చేయడం అవసరం.
కుజ దోషానికి పరిహారాలు
రుణ విమోచక అంగారక స్తోత్రం
బ్రహ్మ దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి బోధించినట్లు స్కంద పురాణంలో వివరించబడింది. ఈ స్తోత్రం పఠించడం వల్ల రుణబాధలు తొలగి, ధనం, సంపదలు వస్తాయి, రోగాలు తగ్గుతాయి. నియమ నిష్టలతో జపిస్తే పితృ రుణం, ఋషి రుణం, దేవ రుణం వంటివి కూడా తొలగి మనసిక శాంతి, సంతోషం, ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రతి మంగళవారం భక్తిశ్రద్ధలతో 11 మంగళవారాలు పూజ చేయాలి. ఎర్ర పూలు, ఎర్ర చందనంతో పూజ చేయాలి. ఎర్ర వస్త్రం సమర్పణ చేయాలి. దానిమ్మ పండు నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజ ద్వారా రుణ బాధలు ఉపశమనం పొందుతాయి.
సుబ్రహ్మణ్యుని ఆరాధన
కుజ గ్రహానికి సుబ్రహ్మణ్యుడు అధిదేవత. కుజ దోషం వల్ల వివాహం ఆలస్యం లేదా సంతానం సమస్య ఉంటే, 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి. ఆరు షణ్ముఖ క్షేత్రాలు లేదా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేయాలి. ఈ పరిహారాలు వివాహం, సంతానం, ఆర్థిక స్థితి సమస్యలను సులభతరం చేస్తాయి.
కుజ దోషం ఉంటే జీవితంలో అనేక సమస్యలు కలుగుతాయి. . కానీ, స్తోత్ర జపం, అంగారక పూజ, సుబ్రహ్మణ్యుని ఆరాధన ద్వారా ప్రతికూల ప్రభావాలు తగ్గించి ధైర్యం, సంపద, విజయం, సంతోషం సాధించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం సూచించిన ఈ పరిహారాలు అనుసరించడం ద్వారా జీవితంలో శాంతి, శ్రేయస్సు పొందవచ్చు.
Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.
