
ఓ ప్రధానోపాధ్యాయురాలి ముందు చూపు 30 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడింది. వరుస సెలవుల తో బడికి వేసిన తాళం పగిలి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వంట పాత్రలకు విషం పూసి ఉండటం సమీపంలోనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో షాక్ కు గురైన ఆ ప్రిన్సిపాల్ మధ్యాహ్న భోజనాన్ని నిలిపేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత శని వారం మొదలు సోమవారం వరకు మూడు రోజులు వరుస సెలవులు రావడంతో పాఠశాలకు ఎవరు రాలేదు. ఇదే అదునుగా బావించిన ఓ దుండగుడు ఏకంగా విద్యార్థుల ప్రాణాలు తీసేందుకు కుట్ర పన్నాడు. 30 మంది చిన్నారులను హతమార్చాలని స్కెచ్ వేశాడు. పాఠశాల వాటర్ ట్యాంక్లో పురుగులమందు కలిపి.. విద్యార్థులలు మధ్యాహ్న భోజనం వండే పాత్రలపైనా విషం చల్లాడు. పాఠశాల సిబ్బంది అప్రమత్తం కావడం.. ప్రిన్సిపాల్ కు వెంటనే సమాచారం ఇవ్వడం.. ప్రిన్సిపాల్ మధ్యాహ్న భోజానాన్ని వండకుండా ఆదేశించడంతో పెను ప్రమాదం తప్పింది.
వరుస సెలవుల తర్వాత మంగళవారం పాఠశాలకు వచ్చిన వంట సిబ్బంది భోజనం వండేందుకు వంట పాత్రలు శుభ్రం చేసేందుకు బయటకు తీశారు. ఈ క్రమంలో వంట పాత్రల నుండి విపరీతమైన దుర్వాసన రావడం.. నీళ్లతో కడుగుతుంటే అదే స్థాయిలో నురగ రావడం అలర్ట్ అయ్యారు. మద్యాహ్నభోజన సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే ప్రధానోపాధ్యాయుడు, టీచర్లకు తెలియజేశారు.
దీంతో వారంతా పాఠశాల ఆవరణను తనిఖీ చేయగా.. పురుగులమందు డబ్బాలు దర్శనమిచ్చాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడిన పాఠశాల సిబ్బంది మరింతగా తనిఖీ చేశారు. ఈ మేరకు వాటర్ ట్యాంక్లోనూ పురుగులమందు కలిపినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులను మంచినీరు తాగొద్దని హెచ్చరించారు. పోలీసులకు వెంటనే సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. విషం డబ్బాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం కాస్త విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
గ్రామస్థులతో కలిసి స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమ పిల్లలు భోజనం చేసినా, మంచినీరు తాగినా ప్రాణాలు కోల్పోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అభంశుభం తెలియని చిన్నారులను చంపేందుకు కుట్రలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ విచారణను వేగవంతం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ భీమేశ్ ను పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించారు. ధర్మపురికి చెందిన వ్యక్తిపై అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు.
పోలీసుల అనుమానమే నిజమైంది..
ధర్మపురి గ్రామానికి చెందిన సోయం కిస్టును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా… తానే పురుగుల మందు కలిపినట్లు అంగీకరించాడు. నిర్మల్లో ఉన్న తన సోదరుడి ఇంటి నుంచి పురుగుల మందు తీసుకొచ్చి.. పాఠశాల వంట గది తాళాన్ని పగలగొట్టి నీటిలో విషం కలిపినట్లు ఒప్పుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా నిందితుడు మానసికంగా ఇబ్బందిపడుతున్న కిస్టు.. తన ఇంట్లో వారిపై ఉన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి.. 329(4), 324(6), 331(8), 332 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. సమయానికి పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు అలర్ట్ అవడంతోనే పెను ప్రమాదం తప్పిందని ఎస్పి తెలిపారు. జిల్లా పోలీసులకు ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ కృతజ్ఞతలు తెలిపారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి ఏదైనా కుట్ర కోణం దాగుందా తేల్చాలని ఆమె కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి