

తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించిన విజయ్.. విల్లుపురం వేదికగా గతేడాది అక్టోబర్లో భారీ బహిరంగ నిర్వహించారు. తమిళనాడు రాజకీయం దద్దరిల్లేలా ఆ సభను నిర్వహించిన విజయ్.. ఇప్పుడు ప్రజల తరఫున పోరాటానికి దిగారు. చెన్నై శివారులోని పరందూరులో ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆయన నిరసన వ్యక్తం చేశారు. తొలిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన విజయ్ కోసం వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. చెన్నైకి 60కిలోమీటర్ల దూరంలోని పరందూరులో 5వేల 300 ఎకరాల్లో 32వేల కోట్ల వ్యయంతో ఎయిర్పోర్ట్ నిర్మించాలని స్టాలిన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో 47శాతానికి పైగా వ్యవసాయ భూములే. అంటే ఏకంగా 1386హెక్టార్ల వ్యవసాయ భూమి. ఇక చెరువులు, కుంటలు మరో 576 హెక్టార్లు. ఈ భూములను ఇచ్చేది లేదంటూ 900కి పైగా రోజుల నుంచి 13 గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతులకు మద్దతుగా నిలిచారు టీవీకే అధినేత విజయ్.
పచ్చని పొలాల్లో విమానాశ్రయం ఏంటంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అభివృద్ధికి టీవీకే వ్యతిరేకం కాదు.. కానీ వేలాది ఎకరాల వ్యవసాయ భూములను నాశనం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న చర్యలను సహించం.. రైతులకు అండగా పోరాటం చేస్తామన్నారు దళపతి విజయ్. చెన్నై ఎయిర్పోర్ట్లో రద్దీని తగ్గించేందుకు రెండో ఎయిర్పోర్ట్ నిర్మించాలనేది ప్రభుత్వం ఆలోచన. 2028లోపు ఎయిర్ పోర్ట్ పూర్తి చేసేందుకు కసరత్తు కూడా చేస్తోంది. కార్గో సేవలతో పాటు పలు అవసరాలను ఈ ఎయిర్పోర్ట్ వినియోగించాలనేది సర్కార్ ప్లాన్. అయితే స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ పొలాలను ఇచ్చేది లేదంటూ పోరాటానికి దిగారు. వారికి మద్దతుగా నిలిచారు టీవీకే అధినేత విజయ్. ఈ పర్యటనకు తొలుత పోలీసులు అనుమతించలేదు. ఆఖరి నిమిషంలో నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారాయన.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..