మూడు రోజులు తిండి తిప్పలు లేకుండా నరకం చూసింది. ఇక తాను అక్కడే చనిపోతాను అని నిశ్చయించుకొని దీనంగా చూస్తూ కూర్చుండిపోయింది. అప్పుడే ఒక వ్యక్తి దాని బాధను అర్థం చేసుకున్నాడు. పిచ్చుక ప్రాణం కూడా మనిషి ప్రాణం లాగే అని భావించి దాన్ని కాపాడేందుకు చాలానే ప్రయత్నించాడు. కానీ ఆ దుకాణం తెరిస్తే తప్ప పిచ్చుకను బయటకు తీసుకు రాలేమని అతడికి అర్థమయింది. ఎందుకంటే ఆ దుకాణాన్ని కోర్టు ఆదేశాల మేరకు సీల్ చేశారు. దాన్ని ఓపెన్ చేసే అధికారం ఎవరికీ లేదు. కానీ ఎలాగైనా ఆ బుజ్జి పిట్టను కాపాడాలనుకున్న అతడు ఊరందరినీ ఏకం చేశాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించిన ఈ కథ కేరళలో జరిగింది. కేరళ కన్నూరులోని ఉల్లికల్ గ్రామంలో ఒక బట్టల దుకాణం ఉంది. అయితే ఆరు నెలల క్రితం ఆ దుకాణ భాగస్వాములు గొడవపడి కోర్టుకు వెళ్ళారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ఆ దుకాణాన్ని సీల్ చేసింది. ఎవరూ అందులోకి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇక అప్పటి నుంచి ఆ దుకాణం మూసే ఉంచగా ఏప్రిల్ ఏడవ తేదీన అనుకోకుండా ఒక పిచ్చుక అందులోకి ప్రవేశించింది. ముఖ్యంగా షట్టర్ ముందు వైపు గాజు గ్లాస్ ఉండగా ఆ రెండిటి మధ్య ఇరుక్కుపోయింది. ఇలా ఆ దుకాణంలో చిక్కుకుపోయిన పిచ్చుకకు బయటకు ఎలా రావాలో తెలియక నానా ఇబ్బందులు పడింది. ముఖ్యంగా తీవ్రంగా చప్పుడు చేస్తూ తన బుజ్జి ముక్కుతో ఆ గాజు గ్లాసును పగలగొట్టేందుకు ప్రయత్నించింది. అటుగా వెళుతున్న పాదాచారులు ఆటో డ్రైవర్లు ఈ విషయాన్ని గుర్తించారు.
