
తునికి పండు.. ఈ పండు పేరు చెప్పగానే అలాంటి పండు కూడా ఉంటుందా అని నోరేళ్ల బెట్టే వాళ్లు ఎందరో..! కానీ ఒక్కసారి రుచి చూశారా మళ్లీ మళ్లీ కావాలని కోరుకోవడం మాత్రం పక్కా.. అలా అని ఈ పండు ఏడాది పొడుగూత దొరుకుతుందనుకుంటే పొరపాటు. కేవలం వేసవిలో అదికూడా కేవలం మూడంటే మూడు వారాలు మాత్రమే దొరికే మహా ప్రసాదం లాంటి పండు అది. అడవి తల్లి అందించిన వరం ఆ పండు. చెప్పుకుంటూ పోతే ఈ పండు ప్రత్యేకతే వేరు.
కేవలం నెలరోజులు (మార్చి మూడో వారం నుంచి ఏప్రిల్ రెండో వారం చివరి వరకు) మాత్రమే లభించే ఈ పండ్ల చెట్లను ఎవరూ ప్రత్యేకంగా పెంచరు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం కూడా అరుదే. కానీ అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో మాత్రం మండు వేసవి వచ్చిదంటే చాలు ఈ పండ్లే అటు వన్య ప్రాణులకు ఇటు ఆదివాసీ గిరిజనులకు పోషకాలను అందిస్తాయి.
పండు పైభాగంలో గట్టిగా.. లోపలంతా నాజుగ్గా గుజ్జుగా ఉంటుంది. ఈ గుజ్జు రుచి అద్భుతం. అటు తీపి కాదు ఇటు వగరు కాదు అన్నట్టుగా ఉంటుంది ఈ పండు రుచి. ఆదిలాబాద్ ఏజేన్సీలో ఈ పండుకు ఎవర్ గ్రీన్ అటవీ ఆహారంగా పేరుంది. వీటి సేకరణ కూడా అంతే పద్దతిగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఉదయం 6 గంటల లోపే అడవిలోకి వెళ్లి తునికి చెట్లకు పండిన ఈ తునికి పండ్లను సేకరిస్తారు గిరిజనులు. అలా లభించిన పండ్లను స్థానిక మార్కెట్ లో విక్రయిస్తారు.
తునికి పండ్లు పోషకాలు పుష్కలంగా ఉండి ఆరోగ్య పరంగా అందరికీ మేలు చేస్తాయి. పైన తోలు లోపల గుజ్జు, ఆ గుజ్జు లోపల గింజలు ఉంటాయి. అయితే లోపలి గుజ్జును మాత్రమే తింటారంతా. తింటే తీపి, వగరు రుచిలో ఉండే ఈ తునికి పండ్లలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు, వివిధ రకాల చక్కెరలు, పీచు పదార్థం కూడా ఇందులో లభిస్తుంది. కాలానుగుణంగా లభించే ఈ తునికి పండ్లను తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు కూడా ఇందులో చాలానే ఉన్నాయి.
ముఖ్యంగా ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్లు ఎ, సి, ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. తునికి పండ్లు డయాబెటిస్ ఉన్నవారికి గొప్ప వరం అని చెప్తున్నారు నిపుణులు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయంటున్నారు.
తునికి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటం వల్ల వయస్సు మీద పడడం, చర్మంపై ముడతలు రావడాన్ని తగ్గిస్తాయి. దీంతోపాటు స్కిన్ టోన్‌ను మెరుగు పరుస్తాయి. అలాగే సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల భారీ నుంచి సైతం చర్మాన్ని రక్షిస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉండటంతో యవ్వనంగా కనిపిస్తారు. తునికి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే బీపీని నియంత్రించవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు వైద్యులు. ఫలితంగా హార్ట్ ఎటాక్ లేదా ఇతర గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చని చెప్తున్నారు.
ఈ తునికి పండ్లు ఆదిలాబాద్ ఆకురాల్చే అడవుల్లో విరివిగా లభిస్తాయి. ఉట్నూర్ ఏజేన్సీ ప్రాంతంలోని నార్నూర్ , జైనూర్ , తిర్యాణి, ఉట్నూర్ ప్రాంతంలో పుష్కలంగా లభిస్తున్నాయి. అయితే అడవుల నరికివేతతో తునికి, పాలచెట్లు
అంతరించిపోతున్నాయి. దీంతో పోషక విలువల గనిగా పేరున్న తునికి, పాలపండ్లు విరివిగా దొరకడం లేదు. అటవీశాఖ అధికారులు కూడా ఈ వృక్షాలపై దృష్టి సారించడంలేదు. అక్కడక్కడా ఒకటో, రెండో చెట్లు ఉండగా గిరిజనులు పండ్లను సేకరించి విక్రయిస్తున్నారు.
వేసవి కాలం ఏప్రిల్, మే నెలల్లో లభించే ఈ పండ్ల కోసం పలువురు ఎదురుచూస్తుంటారు. కాగా వీటిని పక్షులు, కోతులు, ఎలుగుబంట్లు ఎక్కువగా తింటాయని గిరిజనులు చెబుతున్నారు. తునికి (టెండూ ఫ్రూట్) పండ్లు తింటే అజీర్తి, నోటి పూత సమస్యలు తగ్గుతుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తీసుకోవచ్చని, వీటిని డ్రై ఫ్రూట్‌గా కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు.
తునికి పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం సమస్య ఉండదంటున్నారు వైద్యులు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు తగ్గుతాయి. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటారు. తునికి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి. తీవ్రమైన వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇలా తునికి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు వైద్యులు. పర్సిమోన్ పండ్లుగా… హిందీలో అమర్ ఫల్ గా.. తెలుగులో తునికి పండ్లుగా పేరొందిన ఈ పండు. అడవి సపోటాగా గుర్తింపును పొందింది. మరెందుకు ఆలస్యం.. తునికి పండ్లను ఇప్పుడే ఇంటికి తెచ్చుకోండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..