
మల్లన్న సాగర్, కొండపోచమ్మ భూ నిర్వసితులను కష్టాలు ఇంకా వెంటాడుతునే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం సర్వం ఇచ్చేసిన వారిని ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. భూ నిర్వసితులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఒక స్మశానవాటిక కూడా లేకపోవడంతో, ఎవరైన చనిపోతే వారికి అంత్య క్రియలు చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. ఎవరైనా చనిపోతే బాధపడే బదులు, చస్తే ఎక్కడ పూడ్చాలి అనే భయం నిర్వాసితుల్లో కనిపిస్తోంది. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపునకు గురైన సుమారు 14 గ్రామాల ముంపునకు గురైన ప్రజలను, గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీకి 2020లో తరలించారు. ఈ ఆర్అండ్ఆర్ కాలనీలో 15 వేలకుపైగా జనాభా ఉన్నారు. అయితే ఈ కాలనీలో ఎవరైనా చనిపోతే వారిని పాతిపెట్టేందుకు, ఇక్కడి అధికారులు స్థలాన్ని చూపెట్టకపోవడంతో, అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చిన ప్రతిసారి ఈ భూ నిర్వాసితులు నానా అవస్థలు పడుతున్నారు.
గజ్వేల్ డబుల్ బెడ్రూం ఇల్లు, గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ మధ్యలో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. దహన సంస్కారాలు చేసే వారు ఉన్న స్థలంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండగా, ఖననం(పూడ్చి పెట్టడం) చేయాల్సిన వారికి మాత్రం తీవ్ర స్థాయిలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, బంజేరుపల్లి, ఎర్రవల్లి, సింగారంతో పాటు వాటి మధిర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో ముట్రాజ్‌పల్లి వద్ద ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించగా వారు ఇక్కడ ఉంటున్నారు. ఇక ములుగు మండలంలో కొండ పోచమ్మ సాగర్ నిర్మాణంతో బైలంపూర్, తానేదార్పల్లి, మామిడ్యాల, తండా గ్రామాలు ముంపునకు గురికాగా వీరి కోసం తునికి బొల్లారంలో ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించారు. ఇక్కడ 1,350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
ఇండ్ల నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం కల్పించిన ఆఫీసర్లు శ్మశానవాటిక ఏర్పాటును మాత్రం పట్టించుకోలేదు. దీంతో కాలనీల్లో ఉంటున్న వారు ఎవరైనా చనిపోతే అందుబాటులో ఉన్న స్థలాల్లోనే దహన కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు ఆర్అండ్ఆర్ కాలనీ పక్కన ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల సమీపంలోని ఖాళీ స్థలంలో దహన సంస్కారాలు చేస్తుండగా, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు కాలనీ సమీపంలోని వంటిమామిడి నుంచి తునికి బొల్లారం రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తుండడంతో ఎప్పటికప్పుడు వారికి ఎదో ఒకటిచెప్పి, నచ్చజెప్పుకుంటూ కార్యక్రమాలను పూర్తి చేయడం పెద్ద తలనొప్పిగా మారింది.
హిందువుల్లోని కొన్ని వర్గాలతో పాటు ముస్లిం, క్రిస్టియన్లు చనిపోయిన వారిని పూడ్చి పెట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ముట్రాజ్‌పల్లి వద్ద గల మల్లన్నసాగర్ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మైనార్టీలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి సమస్యలు ఏర్పడడంతో స్థానికులను బతిమాలి సంగాపూర్, గజ్వేల్ పట్టణాల శ్మశానవాటికల్లో అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. కొండ పోచమ్మ సాగర్ ఆర్అండ్ఆర్ కాలనీలో ఇటీవల ఓ బాలుడు చనిపోగా ఖననం చేసే విషయంలో పెద్ద గొడవ జరిగింది. మరోసారి ఒక వ్యక్తి చనిపోగా అతడి అంత్యక్రియలు ఎక్కడ జరపాలో అర్థంకాక, ఆ మృతదేహంతో స్థానిక ఆర్డీవో కార్యలయం ముందు వేసి కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఇక మరో వైపు తాత్కాలికంగా దహన సంస్కారాలు చేస్తున్న ప్రదేశంలో శవాన్ని పూడ్చి పెట్టే ప్రయత్నం చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది తమ పురాతన గ్రామ శివారు ప్రాంతాలకు వెళ్లి అంతిమ ఘట్టాలను పూర్తిచేస్తున్నారు. ముంపు గ్రామం అయిన బ్రాహ్మణ బంజేరుపల్లి శివారులో అడవి ప్రాంతంలో ప్రభుత్వం శ్మశాన వాటికను నిర్మించినప్పటికీ అందులో పూడ్చిపెట్టేందుకు మాత్రం స్థలాన్ని కేటాయించలేదు. శ్మశానవాటికలకు స్థలాన్ని కేటాయించాలంటూ మండలస్థాయి అధికారుల నుండి, డివిజనల్ అధికారికి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య మాత్రం పెండింగ్ లోనే మిగిలిపోయిందని అంటున్నారు భూ నిర్వసితులు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యను అర్థం చేసుకొని శ్మశానవాటికల కోసం స్థలం కేటాయించాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.