దేవాలయానికి వెళ్లిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడం.. పసుపు కుంకుమలు సమర్పించడం.. కొబ్బరికాయలు ముడుపు కట్టడం, బంగారం వెండి కానుకలు సమర్పించడం చూస్తుంటాం.. సమ్మక్క-సారక్క దేవతలకైతే బెల్లం మహా నైవేద్యంగా సమర్పిస్తారు. హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడికి మాత్రం రాచగుమ్మడికాయలే మహా నైవేద్యం.. కోటీశ్వరులైనా.. కటిక పేద భక్తులైనా, ఎంతటివారైనా సరే ఈ దేవుణ్ణి దర్శించుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని రావాల్సిందే..!
కొత్తకొండ వీరభద్రస్వామి కి మొక్కులు మొక్కుకున్న ప్రతిఒక్కరు ఆ కోరిక తీరిన వెంటనే నెత్తిన రాచగుమ్మడికాయ ఎత్తుకుని కొత్తకొండకు క్యూ కడుతుంటారు. వీర బద్రస్మామికి గుమ్మడికాయ మొక్కు చెల్లిస్తారు. సామాన్య భక్తులే కాదు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా నెత్తిన గుమ్మడికాయ, చేతిలో కోర మీసాలతో తరలి వచ్చి మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు గుమ్మడికాయ నెత్తిన ఎత్తుకొని కోర మీసాల వీరన్నకు రాచగుమ్మడికాయ సమర్పించడమే ఈ ఆలయంలో ఆనవాయితీ.. జాతర సందర్భంగా వేలాది గుమ్మడికాయలు సమర్పిస్తారు..
ఇక్కడ పండితులు చెబుతున్న పురాణ చరిత్ర ప్రకారం.. గుమ్మడికాయ మొక్కులకు చాలాపెద్ద చరిత్రే ఉంది. దక్షయజ్ఞంలో దక్షుడిని వీరభద్రుడు సంహరించినట్లు చరిత్ర చెబుతుంది. వీరభద్రుడి కోపాన్ని శాంతింప చేయాలంటే ఎన్ని తలలు తెగినా అసాధ్యమే..! పరిహారంగా కూష్మాండం అంటే రాచగుమ్మడి కాయను సమర్పించి శాంతింపజేశారట. అందుకే వీరభద్రుడు శాంతించి అనుగ్రహిస్తాడనేది నమ్మకం. ఆ నమ్మకంతోనే భక్తులు నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జాతర సమయంలో కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలో వేలాది రాచగుమ్మడికాయల వ్యాపారం జరుగుతుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు కూడా నెత్తిన రాచగుమ్మడి ఎత్తుకొని వీరభద్రుడి సన్నిధిలో వాలిపోతుంటారు. వీరభద్రుడికి రాచగుమ్మడికాయ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అదే ఇక్కడ ప్రత్యేకత..!
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
