
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ దాడిలో చాలా మంది పర్యాటకులు చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో మంత్రి అమిత్ షా కాశ్మీర్ చేరుకున్నారు. అలాగే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ట్రంప్ ఈ దాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ సమయంలో ప్రధాని మోదీకి, భారత ప్రజలకు అండగా నిలుస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారత్‌కు అండగా నిలిచారు. ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు పుతిన్. భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు రాహుల్ గాంధీ. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు సోనియా గాంధీ. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, వైసీపీ అధినేత జగన్ కూడా దాడిని ఖండించారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ ఉగ్రదాడిపై స్పందించారు. ఇలాంటి చర్యలతో భారతీయుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరన్నారు. అటు కేసీఆర్, కేటీఆర్ కూడా చనిపోయినవారికి సంతాపం ప్రకటించారు.
అది ప్రశాంతమైన ప్రాంతం. మినీ స్విస్ అనే పేరున్న ప్రాంతం. అందాల కాశ్మీరంలో ఆ ప్రదేశానికి సందర్శకుల తాకిడి కూడా ఎక్కువే. పెహల్గాం కొండ ప్రాంతం 500 మంది టూరిస్టులతో నిండిపోయింది. ఇంతలోనే అలజడి. తుపాకుల మోత.. తూటాలు గాల్లోకి దూసుకుపోతున్నాయ్. అక్కడున్నవారంతా బిక్కచిక్కిపోయారు. భయాందోళనతో పరుగులు తీస్తున్నారు. ఎవరు ఎటువైపు పరిగెత్తుతున్నారో తెలియని పరిస్థితి. చుట్టూ కొండప్రాంతం చెట్లు దట్టంగా ఉండడంతో అటువైపు పరిగెత్తాలని చూశారు. కాని ముష్కరుల నరమేధం మాత్రం ఆగలేదు. చల్లని ప్రదేశాన్ని చూద్దామని వచ్చిన వారిని పొట్టనబెట్టుకున్నారు.
కశ్మీర్ పొలీస్, ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఆరుగురు ముష్కరులు.. లోడెడ్ తుపాకులను అమాయకులైన టూరిస్టులపైకి ఎక్కుపెట్టారు. గుర్రాలపై రైడింగ్ చేస్తున్నవారిని.. ఫొటోలకు పోజులు ఇస్తున్న వారిని.. కుటుంబాలతో సేదదీరుతున్న వారినీ వదల్లేదు. పేర్లు, ఐడీ కార్డులు అడిగిమరీ చంపేశారు. కొందర్ని దుస్తులు విప్పించి మరీ చంపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో కేవలం పురుషులనే చంపారు ముష్కరులు. మగవారిని తమ భార్యలు, పిల్లల ముందే కాల్చిపడేశారు. కొందరి తలలో తూటాలు దించారు. మరికొందర్ని ప్రైవేట్ పార్ట్స్‌పై కాల్చారు. నోట్లో గన్ పెట్టి ఇంకొందర్ని చంపేశారు కనికరం లేని ఆ ఉగ్రమూక.
ఈయన కర్నాటక శివమొగ్గకు చెందిన మంజునాథ రావ్. ముందురోజు భార్యతో దాల్‌లేక్‌లో విహరించారు. అప్పుడు తీసుకున్న వీడియో ఇది. తన కుమారుడితో కలిసి మంజునాథ రావ్, పల్లవి దంపతులు కశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చారు. మనీ స్విస్ చూద్దామని పెహల్గాం వస్తే ఇక్కడ జరగరాని ఘోరం జరిగిపోయింది. తన కుమారుడు, భార్య ముందే ముష్కరులు మంజునాథరావ్ని తలలో కాల్చి చంపారు. ఆ ఘోరఖలిని చూసిన ఆమె గుండెలవిసేలా రోదించింది. తన భర్తనే కాదు తమను కూడా చంపేయండి అంటూ పల్లవి, ఆమె కుమారుడు ముష్కరులతో గొడవకు దిగారు. వెళ్లి మోడీకి చెప్పుకోండి అంటూ ఉగ్రవాదులు సమాధానం చప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈయన లెఫ్ట్‌నెంట్ వినయ్ నర్వాల్. భారత నేవీ ఆఫీసర్. హర్యానాకు చెందిన నర్వాల్‌కు ఆరు రోజుల క్రితమే పెళ్లైంది. 19న రిసెప్షన్ జరిగింది. అది పూర్తైన వెంటనే హనీమూన్‌కు వచ్చారు నర్వాల్ దంపతులు. ముష్కరులు ఆయనను కిరాతకంగా భార్యముందే చంపేశారు. చెప్పాలంటే కాళ్లకు పారాని ఆరకముందే ఆమె తన భర్తను కోల్పోయింది. ఇక కాన్పూర్‌కి చెందిన శుభం ద్వివేది అనే యువకుడు కూడా ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు రెండునెలల క్రితమే.. పెళ్లైంది. భార్య, కుటుంబ సభ్యులతో సహా 11మంది కశ్మీర్ సందర్శనకు వచ్చారు. తన భార్యతో కలిసి సరదాగా గుర్రపు స్వారీ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శుభం ద్వివేది పేరు అడిగిమరీ.. ప్రాణాలు తీశారు.
ఇక హైదరాబాద్‌కు చెందిన ఐబీ అధికారి కూడా ప్రాణాలు వదిలారు. మనీష్ రంజన్ ఇంటెలిజన్స్ బ్యూరోలో అధికారిగా పనిచేస్తున్నారు. కుటుంబంతో కలిసి కశ్మీర్ సందర్శించాలనుకున్నారు. వారం రోజులు లీవ్ తీసుకుని పెహల్గాం వెళ్లారు. అక్కడ భార్య, బిడ్డల ముందే ముష్కరులు చంపేశారు. ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు వాడినట్లు తెలుస్తోంది. మోటాస్ సైకిళ్లపై వచ్చి ఈ దాడికి దిగినట్లు అనుమానిస్తున్నారు. హిట్ అండ్ రన్ తరహాలో వేగంగా వచ్చి.. కనిపించిన వారికి కాల్చివేసి పారిపోయే పంథాలో ఈ ఉగ్ర ఆపరేషన్ సాగింది. చనిపోయిన వారిలో నేపాలీలు ఉన్నారు. యూఏఈకి చెందిన వ్యక్తి ఉన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.
ఘటన జరిగిన క్షణాల్లోనే ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదుల కోసం వేటకొనసాగుతోంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హుటాహుటిన కశ్మీర్ చేరుకుని అత్యున్నత స్థాయి మీటింగ్‌ను ఏర్పాటుచేశారు. అటు ప్రధాని మోదీ సౌదీపర్యటనను కూడా అర్ధంతరంగా ముగించుకున్నారు. ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి చేసినవారిని విడిచిపెట్టేది లేదంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ముష్కరుల దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈరోజు జమ్ముకశ్మీర్ బంద్‌కు పిలుపునిచ్చింది అధికారిక JKNC పార్టీ. అటు పలు రాష్ట్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ నినాదాలు చేశారు.