

నేరాలను నియంత్రణతోపాటు మహిళల భద్రత కోసం తమిళనాడు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలో రెడ్ బటన్ రోబోటిక్ కాప్ అనే కొత్త భద్రతా పరికరాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త పరికరం ప్రత్యేకంగా మహిళల భద్రతను నిర్ధారిస్తుందని, అపత్కర సమయాల్లో వారికి అండగా ఉంటుందని పోలీసులు తెలిపారు. గ్రేటర్ చెన్నై పోలీసులు నగరంలోని 200 ప్రదేశాలలో రెడ్ బటన్ రోబోటిక్ కాప్ అనే కొత్త పరికరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. చెన్నై లాంటి నగరాలతోపాటు దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయా లాంటి చట్టాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు.. ఇలాంటి తరుణంలో చెన్నై మెట్రోపాలిటన్ పోలీసులు ఈ సరికొత్త ఆవిష్కరణతో నేరాలను నియంత్రించేందుకు సాంకేతికను వినియోగించాలని నిర్ణయించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో రెడ్ బటన్ రోబోటిక్ కాప్ భద్రతా పరికరంతో నగరంలో మహిళలకు అభయమిచ్చేలా.. అలాగే లా అండ్ ఆర్డర్ వ్యవస్థను పటిష్టంగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు.
త్వరలోనే అందుబాటులోకి ‘రెడ్ బటన్ – రోబోటిక్ కాప్’..
ఈ రెడ్ బటన్ రోబోటిక్ కాప్ జూన్ 2025 నుండి చెన్నైలోని 200 ప్రదేశాలలో ఏర్పాటు చేయబడుతోంది. ఈ రెడ్ బటన్ రోబోటిక్ కాప్ బటన్‌ను రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, పార్కులు వంటి చెన్నైలోని కీలక ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నారు.
ఆపదలో ఉన్న వ్యక్తులు లేదా వారికి దగ్గరగా ఉన్నవారు ఈ రెడ్ బటన్ – రోబోటిక్ కాప్ పరికరంలో ఏర్పాటు చేసిన ఎరుపు బటన్‌ను నొక్కితే.. వెంటనే పోలీసులకు కాల్ కనెక్ట్ అవుతుంది.. అంతేకాకుండా సమీపంలోని వారికి హెచ్చరిక లాంటి (అలారం) సౌండ్ వినిపిస్తుంది.. అంతేకాకుండా వీడియో కాల్ ద్వారా పోలీసు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.
అదనంగా, పెట్రోలింగ్ వాహనాలు సంఘటనా స్థలానికి నిమిషాల వ్యవధిలోనే చేరుకుంటాయని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. 24 గంటలూ పనిచేయగల ఈ భద్రతా పరికరం, రోడ్డులోని అన్ని ప్రాంతాలను 360 డిగ్రీల కోణంలో కవర్ చేసే ప్రత్యేకతను కలిగి ఉంది.
చెన్నై నగర పోలీసు కమిషనర్ ఎ. అరుణ్ మాట్లాడుతూ, “మహిళలు, ప్రజల భద్రత కోసం మేము అనేక చర్యలు తీసుకున్నాము. ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలలో లేదా నేర సంఘటనలు జరిగే ప్రదేశాలలో రెడ్-బటన్ రోబోటిక్ కాప్ అనే పరికరాన్ని ఏర్పాటు చేస్తాము. ఈ పరికరం మహిళల భద్రతకు ఎంతో సహాయపడుతుంది” అని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..