
కొంతమంది రెండు మూడు రోజులు జ్వరంతో బాధపడుతుంటారు, కానీ హాస్పిటల్‌కు వెళ్లరు. ఎందుకంటే.. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తాడని భయం. అదే తగ్గిపోతుందిలే.. ఇప్పుడు ఇంజెక్షన్ ఎవరు వేయించుకుంటారంటూ అలా మొండిగా ఉంటారు. ఇక పిల్లల విషయమైతే వేరేగా చెప్పక్కర్లేదు.. ఇంజెక్షన్ అంటే చాటు గుక్కపెట్టకుండా ఏడుస్తుంటారు. ఏళ్లు గడిచినా కొంతమందికి ఇంజెక్షన్ అంటే భయం అలానే ఉంటుంది. దాన్నే ట్రిపనోఫోబియా అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం పిల్లలు, 30 శాతం మంది పెద్దలు కూడా ఈ ట్రిపనోఫోబియా బాధితులే.
అయితే.. ఇలా ఇంజెక్షన్ అంటే భయపడేవారికి ఓ గుడ్‌న్యూస్. ఇకపై సూది లేని ఓ కొత్త ఇంజెక్షన్ అందుబాటులోకి రానుంది. నొప్పి ఉండదు, ఇంజెక్షన్ అనే భయం అసలే ఉండదు. సూది లేని ఇంజెక్షన్లను తీసుకొస్తున్నామని ‘ఇంటెగ్రి మెడికల్’ సంస్థ తాజాగా ప్రకటించింది. బెంగళూరులో మంగళవారం నిర్వహించిన ఓ సమావేశంలో సంస్థ ప్రతినిధులు స్కాట్ మెక్‌ఫార్లాండ్, అంకుర్ నాయక్, సర్వేష్ ముతా, మార్క్టిమ్లు ఈ సూది లేని ఇంజెక్షన్ వివరాలు వెల్లడించారు. ‘‘ఎన్-ఫిస్’ పేరిట సూది రహిత ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ పరికరం మందును అధిక వేగంతో చర్మంపై ఉండే రంధ్రాల్లోకి జొప్పిస్తుంది.
దాంతో ఎలాంటి నొప్పి లేకుండానే కండరాల్లోకి ఔషధం వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్‌ను దేశంలో వెయ్యి కన్నా ఎక్కువ మంది వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. టీకాలు తయారు చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో తమ ఉత్పత్తిని వినియోగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని ఇంటెగ్రి మెడికల్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మరి ఇంజెక్షన్ అంటే భయపడేవారికి ఈ విషయం తెలియజేయండి హ్యాపీగా ఫీల్ అవుతారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.