
చెన్నై, ఏప్రిల్ 12, 2025: తమిళనాట ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉంది.. అయినా ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది.. అందుకు బీజేపీయే తొలి అడుగు వేసింది. అన్నా డిఎంకెతో పొత్తు ఒప్పందం కుదుర్చుకుంది. 2026లో తమిళనాట అధికారమే లక్ష్యంగా కసితో పనిచేస్తోంది బీజేపీ.. అందుకు అన్నాడీఎంకేతో పొత్తు ఒక్కటే సరిపోతుందా..? అధికార డీఎంకేని ఢీకొట్టాలంటే ఇది ఒక్కటి మాత్రం సరిపోదు.. ఇంకా చేయాల్సిన కసరత్తు ఏంటి..
తమిళనాట రెండే పార్టీలు మార్చిమార్చి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. అయితే 2021 కి ముందు జరిగిన ఎన్నికలు ఒక లెక్క.. ఆ తర్వాత ఇప్పుడు జరగనున్న ఎన్నికలు మరో లెక్క.. 2021 కి ముందు డిఎంకె ని కరుణానిధి, అన్నాడిఎంకెను జయలలిత లీడ్ చేస్తూ వచ్చారు. ఇద్దరి మరణానంతరం అక్కడి లెక్కలు కాస్త మారినట్టే కనబడుతున్నాయి. అప్పటిదాకా ఆ రెండు పార్టీలకు వారిద్దరే పెద్ద బలం.. కానీ తాజా పరిస్థితుల్లో పార్టీని లీడ్ చేస్తున్న వారితో పాటు కూటమి పార్టీల బలం కూడా తోడైతే తప్ప అధికారాన్ని దక్కించుకునే పరిస్థితి లేదు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 53% ఓట్లతో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో డిఎంకె కూటమి 159 స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి 75 స్థానాలు గెలుచుకుని 39% ఓటు బ్యాంకును దక్కించుకుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపితో దూరమై బరిలో నిలిచిన అన్నాడీఎంకే ఓటు బ్యాంకు కేవలం 23 శాతానికి పరిమితమైంది.. ఈసారి బలమైన కూటమిగా బరిలోకి వెళితే తప్ప డిఎంకెను గట్టిగా ఢీకొట్టే పరిస్థితి నెలకొంది. బిజెపి కూడా ఎప్పటినుంచో తమిళనాడులో అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా తాజాగా అమీత్ షా ఆధ్వర్యంలో అన్నాడీఎంకే, బిజెపిల మధ్య మరోసారి పొత్తుపై ఒప్పందం కుదిరింది. బిజెపితో ఒప్పందాలు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే అన్నాడీఎంకే కూటమి నుంచి ముస్లిం మైనారిటీ పార్టీ అయిన ఎస్డిపిఐ బయటకు వచ్చింది. ఆ వెంటనే డిఎంకెను కూడా కలిసి మద్దతు ప్రకటించింది. ఇది ఒక రకంగా అన్నాడిఎంకే కూటమికి నష్టం కలిగించే అంశమని చెప్పొచ్చు. తమిళనాడులో ఇప్పటిదాకా బలమైన పార్టీలుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే మిత్ర పక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్లి ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తున్న పరిస్థితులను చూశాం. అంటే ఓ రకంగా డీఎంకే లేదా అన్నాడీఎంకే రెండు పార్టీల మధ్యే అధికారం దూబూచలాడుతోంది. కానీ ఈ ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది.
డిఎంకెను గట్టిగా కొట్టాలంటే ఇప్పుడున్న బలం ఎన్డీయే కూటమికి సరిపోదు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఒకప్పటి అన్నాడీఎంకే ఇప్పుడు మూడు ముక్కలుగా విడిపోయి ఉంది. జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్రకలగం పార్టీ ఒకవైపు, రంగస్వామి లీడ్ చేస్తున్న అన్నాడీఎంకే ఒక వర్గంగా, జయలలితకు నమ్మిన బంటుగా పేరున మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం పార్టీ నుంచి బహిష్కరణకు గురై సొంత గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి మంచి ఓటు బ్యాంకును సాధించారు.
మూడు ముక్కలుగా చీలిపోయిన అన్నాడీఎంకేలోని ఈ ముగ్గురు ఒక తాటిపైకి వస్తే డిఎంకెను ఢీకొట్టి అధికారంలోకి వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనేది రాజకీయ విశ్లేషకులు మాట. పొత్తులపై చర్చలు జరిగినప్పుడు.. బిజెపి నుంచి కూడా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి ఇదే విషయం చెప్పినట్టు సమాచారం. అయితే పొత్తుల అంశం గురించి మాట్లాడే సందర్భంలో అమిత్ షా ఈ విషయంపై మాట్లాడుతూ అన్నాడీఎంకే అంతర్గత విషయాల్లో బిజెపి జోక్యం చేసుకోదని చెప్పారు. కానీ తెరవెనుక మాత్రం శశికళ, ఓపిఎస్ అందరినీ కలుపుకొని వెళ్లడమే మంచిది అన్న ఆలోచనలో బిజెపి ఉన్నట్టు తెలుస్తోంది. మరి అన్నాడీఎంకేలో చీలికలుపేలికలైన వర్గాలను మళ్లీ ఒకటిగా చేర్చడంలో కమలనాథులు ఏ మేరకు విజయం సాధిస్తారో వేచిచూడాల్సిందే..