

తన గాత్రంతో ఎన్నో వేల పాటలు ఆలపించి మెప్పించారు లెజెండ్రీ సింగర్ కె.జె. యేసుదాస్. ప్రస్తుతం ఆయన పాటలు పాడటం తగ్గించారు. ఆయన కుమారుడు విజయ్ యేసుదాస్ కూడా సింగర్ గా రాణిస్తున్నారు. అయితే ఇటీవల కె.జె. యేసుదాస్ అనారోగ్యానికి గురయ్యారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కె.జె. యేసుదాస్ ఆసుపత్రిలో చేరారని వస్తున్న పుకార్లపై ఆయన కుమారుడు సింగర్ విజయ్ యేసుదాస్ స్పందించారు. కె.జె. యేసుదాస్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారనే వార్తలు వైరల్ అయ్యాయి. వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో యేసుదాస్ ఆసుపత్రిలో చేరారని వార్తలు పుట్టుకొచ్చాయి. 85 ఏళ్ల ఈ లెజెండ్రీ సింగర్ ప్రస్తుతం పలు లైవ్ షోలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు విజయ్ యేసుదాస్ తన తండ్రి అనారోగ్యంతో ఉన్నారనే వార్తలపై సంబంధించి, వివరణ ఇచ్చారు.
ఈ వార్తల గురించి తెలిసి షాక్ అయ్యాను, తన తండ్రి ఆసుపత్రిలో చేరారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. గాయకుడు యేసుదాస్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు కూడా కూడా తెలిపాయి.
నేపథ్య గాయకుడిగా.. సంగీతకారుడిగా యేసుదాస్ ఆరు దశాబ్దాలుగా 50,000 కి పైగా పాటలు పాడారు. గణ గంధర్వన్ గా ప్రసిద్ధి చెందిన యేసుదాస్ మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, అరబిక్, రష్యన్ అలాగే అనేక ఇతర భాషలలో పాటలు పాడారు.కె.జె. యేసుదాస్ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు, వాటిలో ఎనిమిది జాతీయ అవార్డులు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఉన్నాయి. ఆయనకు 1975లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2017లో పద్మవిభూషణ్ అవార్డులు లభించడం గమనార్హం. ఆయన ఆరోగ్యం గురించి ఆన్లైన్లో పుకార్లు వ్యాపించి అభిమానులలో ఆందోళన కలిగిస్తుండగా ఆయన కొడుకు ఇంటర్వ్యూతో ఇప్పుడు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.