
ప్రస్తుత సీజన్లో అడవిలో లభించే ఈ రొయ్యల్ని బొడ్డెంగులుగా పిలుస్తుంటారు. ఈత మొక్కల మొదళ్ళలో లభించే ఈ బొడ్డెంగులను మీసం లేని రొయ్యిగా కూడా గిరిజనులు భావిస్తారు. అడవుల్లో ఈ సీజన్లోనే లభిస్తాయి. గిరిజనులు అమితంగా ఇష్టపడే బొడ్డెంగులు. డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు మాత్రమే అడవుల్లో అందుబాటులో ఉంటాయి. వీటిని సేకరించుట అంత సులభం కాదు. వాటికోసం పెద్ద సాహసమే చేస్తుంటారు గిరిజనులు. కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ అడవుల్లోనే ఈత చెట్ల దగ్గరికి వెళతారు. ఎందుకంటే ఆ ఈత చెట్ల మొదళ్ళలోనే ఉంటాయి ఈ బొడ్డెంగులు. గిరిజన ప్రాంతంలోనే అడవిలో ఏపుగా పెరిగే ఈత మొక్కల వేర్ల దగ్గర తవ్వి వాటిని సేకరిస్తారు అడవి బిడ్డలు. గొడ్డలితో మొదళ్ళ భాగాన్ని తొలిచి, కత్తులతో నడికి, గునపాలతో తవ్వి అడవి రొయ్యలను సేకరిస్తారు. ఆ బొడ్డెంగులు దొరికితే పంట పండినట్లే అని భావిస్తుంటారు గిరిజనులు. ఎందుకంటే ఇవి అన్ని చోట్ల దొరకవు. ఎంత ప్రయత్నించినా అందరికీ లభించవు. అదృష్టం ఉన్న వాడికే అడవి రొయ్యలు దొరుకుతుంటాయని నమ్ముతారు గిరిజనులు.