
కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్‌గా అలా ఉండిపోతాయి. ప్రభాస్‌కు బాహుబలి.. అల్లు అర్జున్‌కు పుష్ప.. యశ్‌కు కేజియఫ్. ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలో కాదు.. పక్క ఇండస్ట్రీల్లోనూ జెండా పాతారు వీళ్ళంతా. ఈ ఇమేజ్ను బట్టే వాళ్ల కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యశ్ కూడా అంతే. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలు చేస్తున్నారు.
కేజియఫ్ 2 వచ్చి మూడేళ్లు కావొస్తుంది. ఈ గ్యాప్‌లో సలార్‌తో వచ్చారు ప్రశాంత్ నీల్. ఆయన మరో రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ యశ్ నుంచి అప్డేట్స్ మెల్లగా వస్తున్నాయి. టాక్సిక్ సినిమా చేస్తున్నారు కానీ దానిపై పెద్దగా అప్డేట్స్ రావట్లేదు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌తోనే బిజీగా ఉన్నారు రాకింగ్ స్టార్. టాక్సిక్ సినిమాను మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు ముంబైలో జరిగింది.
అయితే కొన్ని సీన్స్ నచ్చకపోవడంతో రీ షూట్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే రామాయణ్‌లోనూ నటిస్తున్నారు యశ్. ఇందులో రావణుడిగా నటిస్తున్నారీయన. అంతేకాదు.. రామాయణ్ సినిమాకు యశ్ సహ నిర్మాత కూడా.
నితీష్ తివారి వచ్చి కథ చెప్పినపుడు.. రావణుడి పాత్రను ఉన్నదున్నట్లు తీస్తే తాను నటిస్తానని చెప్పినట్లు తెలిపారు యశ్. వాళ్ళ విజన్ నచ్చి తను కూడా ఈ చిత్రంలో భాగమయ్యానని.. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపిస్తున్నారని తెలిపారు యశ్. అలాగే కేజియఫ్ 3 కూడా ఉంటుందని మరోసారి క్లారిటీ ఇచ్చారీయన.