
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని అర్చకులు దివ్య మనోహరంగా అలంకరించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ విష్ణు గణాలకు అధిపతి అయిన విశ్వక్సేనుడిని పాంచరాత్ర ఆగమ పద్ధతిలో ఆరాధించారు. స్వస్తివాచనం, రక్షాబంధనం, వేద మంత్రోచ్చారణ, చతుర్వేద, ప్రబంధ పారాయణాల నడుము సంప్రోక్షణ, పుణ్యాహ వాచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. నరసింహుడి క్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన స్వామివారి తిరు కళ్యాణోత్సవం 8వ తేదీన జరగనుంది.
భక్తజన బాంధవుడు.. ఆపద మొక్కుల వాడు.. ఏకశిఖర వాసుడిగా నిత్యం కొలిచే ఇంటింటి ఇలవేల్పు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధానాలయ ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలతో దివ్య మనోహరంగా అలంకరించిన స్వామివారిని అధిష్టింపజేశారు. స్వామివారికి నవ కలశాభిషేకం చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఆలయంలో స్వయంభూ నరసింహ స్వామిని ఉత్సవాల నిర్వహణకు ఆజ్ఞ స్వీకరించారు. అర్చకులు, వేదపండితులు, రుత్వికుల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వస్తివాచకంతో ప్రారంభించి, పుణ్యాహవాచనం కార్యక్రమాలు నిర్వహించారు. ఆగమ శాస్త్రానుసారం స్వామి వారి బ్రహ్మోత్సవాల మొదటిరోజున సర్వ సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడికి తొలిపూజలు చేశారు. బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని, లోకాలకు శుభాలు కలుగాలని వేద మంత్రాలు పఠిస్తూ పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో విష్ణు గణాలకు అధిపతి అయిన విష్వక్సేనారాధన చేశారు. ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ స్వస్తివాచనం కార్యక్రమాన్ని ప్రధానార్చక బృందం నిర్వహించింది. పుణ్యాహవాచనంలో భాగంగా శుద్ధ జలాలతో స్వామివారి ప్రధానాలయం, గర్భాలయం, ఆలయ మాఢవీధులు, ప్రాకార మండపాల్లో సంప్రోక్షణ చేశారు.
స్వయంభు లక్ష్మీనరసింహులు కొలువైన ప్రధాన గర్భాలయంలో లక్ష్మీనరసింహులకు పూజలు చేసి, స్వామివారికి కంకణధారణ నిర్వహించారు. బంధనాలను ప్రత్యేక పాత్రలో ఉంచి విమల మొదలగు అష్టదళ శక్తి దేవతలను ఆవాహనం చేసి ధూపదీపాలను సమర్పిస్తూ రక్షా బంధనం వేడుకలను జరిపారు. అనంతరం స్వయంభూ నారసింహులకు, ఆండాళ్ అమ్మవారు, ఆళ్వారు, రామానుజాచార్యులు, విష్వక్సేనుడు, ఉత్సవ మూర్తులకు కంకణధారణ గావించారు. అనంతరం నిర్వాహక బృందం.. భక్తులకు రక్షా బంధనాలను ధరింపజేశారు. రుత్విగ్వరణం, స్వామివారికి మంత్ర పుష్ప నీరాజన కార్యక్రమాలను పాంచరాత్రాగమ శాస్ర్తానుసారంగా ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఆలయ అర్చకులు, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి రక్షాబంధనంలో వేదమంత్రో చ్ఛారణలు, డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాల నడుమ ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనుమతిని పొందారు.
ఇవి కూడా చదవండి
ధ్వజారోహణం…
స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు గరుత్మంతుడిని వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం చేపట్టారు. ప్రధానాలయం ముఖ మండపంలో ధ్వజస్తంభంపై ధ్వజారోహణం, అష్టదిగ్పాలక బలిహరణ కార్యక్రమా లు చేపట్టారు. గరుత్మంతుడి పటాన్ని శ్వేత ధ్వజ పతాకంపై చిత్రించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణం చేశారు.
నృసింహుడికి పోచంపల్లి పట్టువస్త్రాలు…
పోచంపల్లి పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు బహూకరిస్తుంటారు. చేనేత కార్మికులు భక్తిశ్రద్ధలతో నేసిన పట్టు వస్త్రాలను స్థానిక శ్రీమార్కండేశ్వర స్వామి దేవాలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన, కీర్తనలతో పట్టువస్త్రాలతో ప్రదర్శనగా యాదగిరిగుట్టకు వెళ్లి ఆలయ అధికారులకు రెండు పట్టు చీరలు, పట్టు పంచెలు, రెండు శాలువాలను అందజేశారు. అదేవిధంగా మార్కండేశ్వరస్వామి దేవాలయం ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..