
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ప్లేయర్, న్యూజిలాండ్ కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ 2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) సీజన్లో అందుబాటులో ఉండనని వెల్లడించడంతో RCB కి షాక్ కు గురయింది. ఆటకు ఆమె తీసుకున్న తాత్కాలిక విరామం ఆరోగ్య పరిస్థితుల కారణంగా, వ్యక్తిగత శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని డివైన్ నిర్ణయించింది.
డివైన్ నిర్ణయం వెనుక కారణాలు
35 ఏళ్ల సోఫీ డివైన్, మహిళల హై పెర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ హెడ్ లిజ్ గ్రీన్ ప్రకారం, కొన్ని ప్రొఫెషనల్ సలహాల ఆధారంగా ఆటకు విరామం తీసుకోవాలని నిర్ణయించారు. “ఆటగాళ్ల శ్రేయస్సు అన్నింటికన్నా ముఖ్యం. సోఫీకి తగిన విరామం కల్పించడం, మద్దతు అందించడం, ఆమె శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం మా ప్రాధాన్యత,” అని లిజ్ తెలిపారు.
2024లో జరిగిన WPLలో RCB తమ తొలి టైటిల్‌ను గెలుచుకోవడంలో డివైన్ కీలక పాత్ర పోషించింది. ఆ సీజన్లో 10 మ్యాచ్‌లలో ఆమె 136 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు కూడా తీసుకుంది. అయితే, ఈ సీజన్లో ఆమె లేకపోవడం RCB టైటిల్ రేసులో ప్రతికూల ప్రభావం చూపించనుంది.
చార్లీ డీన్ RCBలో చేరిక
RCB జట్టు, డివైన్ గైర్హాజరుతో కృంగిపోవడం అనివార్యమైనప్పటికీ, ఇంగ్లాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ చార్లీ డీన్‌ను గాయపడిన డివైన్ స్థానంలో జట్టులోకి తీసుకుంది. డీన్ ఇప్పటివరకు WPLలో ఆడకపోయినప్పటికీ, ఆమె ఇంగ్లాండ్ తరఫున 36 టీ20ల్లో 46 వికెట్లు తీసి తన సత్తా చాటింది.
సోఫీ డివైన్ 2024 అక్టోబర్‌లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను విజయపథంలో నడిపించడంతో పాటు ఆస్ట్రేలియా, భారత్, WBBL లాంటి పెద్ద టోర్నీలలో నిరంతరం క్రికెట్ ఆడుతూ, తన ఆటతో అభిమానులను అలరించింది. అయితే, క్రికెట్ ప్రపంచంలోని ఒత్తిళ్లు ఆమెను ఈ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసినట్లు తెలుస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) సీజన్‌ను ఫిబ్రవరి 15న గుజరాత్ జెయింట్స్‌తో ఆరంభించనుంది. వడోదరలో నూతనంగా నిర్మించిన BCA స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
సోఫీ డివైన్ లాంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరు RCB కోసం ఒక పెద్ద సవాలుగా మారనుంది. అయినప్పటికీ, RCB జట్టు గత సీజన్లో టైటిల్ గెలిచిన విజయవంతమైన ప్రదర్శనను కొనసాగించడానికి ఆతృతగా ఉంది. కొత్తగా జట్టులో చేరిన ప్లేయర్లతో కలిపి, RCB అభిమానులకు ఉత్కంఠభరితమైన సీజన్‌ను అందించే ప్రయత్నంలో ఉంది.
ఈ మ్యాచ్ RCB సీజన్ రన్‌కు ఒక కీలక ఆరంభం అవుతుంది, డిఫెండింగ్ ఛాంపియన్‌గా వారు మరోసారి విజయకేతనం ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.