
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఏ పని తేదా ప్రయత్నం తలపెట్టినా ఒత్తిడి, శ్రమ కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది. వృత్తి జీవితంలో రాబడి బాగానే పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ వారు, రాజకీయ నాయకులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన ప్రతిఫలాలు పొందుతారు. పిల్లలు చదువుల్లో పైకి వస్తారు. జీవిత భాగస్వామికి బాగా కలిసి వస్తుంది. తరచూ ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి పెరిగే అవకాశం ఉంది. కొన్ని సానుకూల మార్పులకు కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి అవుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొందరు బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. తరచూ శివార్చన చేయడం శుభకరం.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు దశమంలో ఉచ్ఛ శుక్రుడితో యుతి చెందడం, రవితో కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ముఖ్యమైన ఆఫర్లు అందుతాయి. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు కొద్ది ప్రయత్నంతో వృద్ధిలోకి వస్తారు, ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్కంద స్తోత్రం పఠించడం చాలా మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): భాగ్య, లాభ స్థానాల్లో శుభ గ్రహాలు ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువగా ధన లాభాలు పొందుతారు. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి కొద్దిగా ఎక్కువగానే ఉన్నప్పటికీ, రోజంతా చీకూచింతా లేకుండా గడిచిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు సామరస్యంగా, సానుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. తరచూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం చాలా మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఒడిదుడుకులుంటాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందు తుంది. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఈ రాశివారు ఆదిత్య హృదయం చదువుకోవడం ఎంతో శ్రేయస్కరం.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశినాథుడు బుధుడు సప్తమంలో ఉచ్ఛ శుక్రుడితో కలవడం, భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఇంటా బయటా బాగా అనుకూల పరిస్థితులుంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్నంగా ఉండడం మంచిది. వ్యాపారాభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఆదాయాన్ని మించి కుటుంబ ఖర్చులుంటాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగు తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. రాశి మీద రాహు కేతువుల ప్రభావం ఉన్నందువల్ల తరచూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గురు, శుక్రుల పరివర్తన వల్ల ఈ రాశివారికి ఆదాయానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గు ముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. తరచూ లలితా సహస్ర నామ స్తోత్ర పఠనం వల్ల శుభాలు జరుగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో, శుక్ర, గురువులు పంచమ, సప్తమ స్థానాల్లో ఉన్నందువల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు బాగా ఇబ్బంది పెడతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. తరచూ స్కంద స్తోత్రం చదువుకోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అర్ధాష్టమ శని దోషం కూడా బాగా తగ్గుతుంది. శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. వృత్తి జీవితం బిజీ అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారంలో ఆశించిన పురోగతికి అవకాశముంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఈ రాశివారు సుందరకాండ పారాయణ చేయడం అవసరం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో మిత్ర గ్రహాలతో కలిసి ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందివస్తాయి. సొంత పనులు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. దూరపు బందువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. తరచూ శివార్చన చేయించడం మంచిది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశికి ధన స్థానంలో శుభ గ్రహాల యుతి వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. మీ సల హాలు, సూచనల వల్ల కొందరు బంధుమిత్రులు లబ్ధి పొందుతారు. ఇంట్లో శుభ కార్యాలకు, విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా గడిచి పోతుంది. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం ఏర్పడుతుంది. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప అనారోగ్యాలకు అవ కాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. గణపతి స్తోత్రం వల్ల విజయాలు లభిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశిలో నాలుగు మిత్ర గ్రహాల సంచారం వల్ల ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. జీతభత్యాలు, పదోన్నతులకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగతి చెందుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. దుర్గా స్తోత్రం పఠించడం చాలా మంచిది. ఎవరినీ అతిగా నమ్మవద్దు.