
ఎండలు దంచి కొడుతున్నాయి.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 40°C లోపే పరిమితమైనట్లు పేర్కొన్నారు. రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. విచిత్రమైన వాతావరణ అంచనాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గురువారం (03-04-25) అల్లూరిసీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, శుక్రవారం రాయలసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు.
అలాగే గురువారం శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం జిల్లా-5, పార్వతీపురంమన్యం జిల్లా-7, అల్లూరి సీతారామరాజు జిల్లా-3, తూర్పుగోదావరి-2 మండలాల్లో(23) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
గురువారం వడగాలులు వీచే మండలాల వివరాలు ఈ క్రింది లింక్లో చూడండి:
ఈ లింక్ ను క్లిక్ చేయండి..
బుధవారం అనకాపల్లి(D) మాడుగుల 39.4°C, వైఎస్సార్(D) దువ్వూరులో 38.9°C, నంద్యాల జిల్లా కొత్తపల్లిలో 38.7°C, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 38.6°C, పల్నాడు జిల్లా అమరావతి, పార్వతీపురంమన్యం జియ్యమ్మవలసలో 38.3°C, అన్నమయ్య జిల్లా వతలూరులో 38.2°C, గుంటూరు జిల్లా తాడేపల్లి, విజయనగరం జిల్లా నెలివాడ 38.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..