
అటవీ ప్రాంతం.. రెక్కాడితే కాని.. డొక్కాడని కుటుంబాలు.. ఏదో ఒక పనిచేస్తేనే కుటుంబాన్ని పోషించగలరు.. అందుకే.. సీజనల్ గా అటవీ ప్రాంతంలో దొరికే వాటితో జీవనం కొనసాగిస్తారు.. ఇలాంటి పనుల్లో తునికాకు సేకరణ ఒకటి.. ఎండాకాలం వచ్చింది.. ఇప్పుడే తునికాకు సేకరణకు మంచి అవకాశంగా భావించారు ఆ మహిళలు.. అలా .. తునికాకు సేకరణకు అటవీప్రాంతంలోకి వెళ్లారు.. తునికాకులను సేకరిస్తూ.. డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లిపోయారు.. ఆ తర్వాత వారు వెనక్కి ఇంటికి రావాలని భావించినా.. ఎటు వైపు వెళ్లాలో అర్ధం కాలేదు.. దీంతో బిక్కు బిక్కుమంటూ అక్కడే ఉండిపోయారు.. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ అడవిలో చోటుచేసుకుంది.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అటవీ అధికారులు.. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని అడవిలో తప్పిపోయిన మహిళలను క్షేమంగా రక్షించారు..
అసలేం జరిగిందంటే.. కప్పనపల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, కంబాల లింగవ్వ, లక్ష్మి, బత్తుల సరోజా.. గ్రామానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో తునికి ఆకులు తెంపడానికి వెళ్లారు. ఆ అడవిలో దారి తప్పిపోయారు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీ ప్రాంతంలో తునికి ఆకులు తెంపడానికి వెళ్లి రాలేదన్న విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మూడు స్పెషల్ పార్టీ బృందాలతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. డ్రోన్ కెమెరాలతో అడవిని జల్లెడ పట్టారు. మహిళల ఆచూకీ కనిపెట్టి వారిని క్షేమంగా ఇంటికి చేర్చారు అధికారులు..
అయితే.. తమవాళ్లు క్షేమంగా తిరిగిరావడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు మహిళలను క్షేమంగా రక్షించడంతో.. వారిని గ్రామంలోకి పూలు చల్లుతూ స్వాగతం పలికారు.. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో మూడు స్పెషల్ పార్టీ బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..