
వరంగల్ జిల్లాలో రహదారులు నెత్తిరోడుతున్నాయి. లారీ డ్రైవర్ల అజాగ్రత్త, అతివేగం అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో లారీ డ్రైవర్ల బీభత్సం ఊహించని విషాదాన్ని నింపుతోంది. నిన్న ఒక్కరోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన వేరువేరు ప్రమాదాలలో ఏడుగురు బాటసారులు లారీ డ్రైవర్ల ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యానికి బలయ్యారు. 15 మందికి పైగా కూలీలు కాళ్లు చేతులు విరిగి ఆస్పత్రి పాలయ్యారు. హెల్మెట్ లేదు, నెంబర్ ప్లేట్ సరిగా లేదు, సిగ్నల్ జంప్ అయ్యావని సాధారణ వాహనదారులపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే పోలీసులు, రోడ్డు రవాణాశాఖ అధికారులు లారీ డ్రైవర్ల బీభత్సాన్ని మాత్రం నియంత్రించ లేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను లారీ టైర్ల కింద నలిగి పోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరిగిన వేరువేరు లారీ ప్రమాదాలలో ఏడుగురు మృతి చెందారు. 15మందికి పైగా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హసన్ పర్తి మూలమలుపు వద్ద బైక్ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు సీతంపేట గ్రామానికి చెందిన మహేష్, పవన్ గా గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో లారీ డ్రైవర్ల నుండి తమ ప్రాణాలు కాపాడండని హసన్ పర్తి గ్రామస్థులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. వెంకటాపురం మండలం వీరాపురం వద్ద మరో ప్రమాదం జరిగింది.
రోడ్డు పై నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఇసుక లారి అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గోపాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. టేకుమట్ల మండలం రామకృష్టాపూర్ సమీపంలో కూలీలపై పత్తి గింజల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంధ్య, పూలమ్మ అనే ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. అతివేగంగా లారీ నడిపి ఇద్దరి ప్రాణాలు మింగేసిన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బీమదేవరపల్లి మండలం కొత్తపల్లి వద్ద మొరం టిప్పర్ ఢీ కొని ఒకరు మృతి చెందారు. మృతుడు గోదావరిఖనికి చెందిన పాస్టర్ కరుణాకర్ గా గుర్తించారు.
మొగుళ్ళపల్లిలో లారి ఢీ కొని మోత్కూరి రాములు అనేవ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఐదేళ్ల బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామశివారులో మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో అతివేగంగా వస్తున్న లారీని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మహిళలకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలించారు. వారిలో చాలా మందికి కాళ్లు చేతులు విగిరి విగత జీవులుగా మారారు. లారీ డ్రైవర్ల అజాగ్రత్త, ఓవర్ స్పీడే ఈ ప్రమాదాలకు కారణంగా ఆరోపణలు ఉన్నాయి. సగటున రోజుకు ఇద్దరు అమాయక ప్రజలు లారీ ప్రమాదాల్లో బలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.