
వక్ఫ్ అంటే అరబిక్ భాషలో అల్లా దీవెనల కోసం ఆస్తులను దానం చేయడమన్నారు అమిత్‌షా. ఇప్పుడు వక్ఫ్ అంటే అర్ధమే మారిపోయిందన్నారు. వక్ఫ్ బిల్లుపై విపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. టీడీపీ, జేడీయూ బిల్లులను వ్యతిరేకిస్తాయన్న విపక్షం ఆశలు గల్లంతయ్యాయి. అటు టీడీపీ ,ఇటు జేడీయూ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడానికి 272 ఎంపీల మద్దతు అవసరం కాగా ఎన్డీఏ కూటమికి 298 మంది ఎంపీల మద్దతు ఉంది. రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ 119 కాగా ఎన్డీఏ కూటమికి 126 మంది ఎంపీల మద్దతు ఉంది.
వక్ఫ్ బోర్డులో కలెక్టర్‌కు చోటు కల్పించడాన్ని పూర్తిగా సమర్ధించారు అమిత్‌షా.. అది ప్రభుత్వ భూమో, కాదో కలెక్టరే తేలుస్తారని అన్నారు. 2013 లోనే వక్ఫ్ చట్టాన్ని సవరించారని స్పష్టం చేశారు. వక్ఫ్ భూముల పేరుతో గతంలో ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. మైనారిటీ సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు ఎంపీ కృష్ణప్రసాద్. చట్టంలో తాము మూడు సవరణలు ప్రతిపాదించామని, వాటికి JPC ఒప్పుకుందని తెలిపారు. వక్ఫ్ దగ్గర 36.18 లక్షల ఎకరాల భూమి ఉందని, ఆ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వక్ఫ్ బోర్డు ఏర్పాటులో రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని కేంద్రానికి టీడీపీ సూచించింది.
లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. బిల్లుకు మద్దతు తెలిపి టీడీపీ ఏపీలో ముస్లింలకు అన్యాయం చేసిందన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లను వ్యతిరేకిస్తునట్టు ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. కొత్త అధ్యక్షుడి ఎన్నికపై తర్జన భర్జన పడుతున్న బీజేపీ ఈ బిల్లుతో ముస్లింలకు ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. అయితే అఖిలేశ్ ఆయన కుటుంబ సభ్యులే అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని, బీజేపీలో అలాంటి పరిస్థితి ఉండదని కౌంటరిచ్చారు అమిత్‌షా.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి