
వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దాంతో, వక్ఫ్ బిల్లు చట్టంగా మారింది.. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై పార్లమెంట్ ఉభయసభల్లో సుదీర్ఘ చర్చ జరిగింది. లోక్సభలో 14గంటలకు పైగా చర్చ నడిచింది. అనంతరం, జరిగిన ఓటింగ్ ప్రక్రియలో బిల్లుకు అనుకూలంగా 288మంది.. వ్యతిరేకంగా 232మంది ఓటేశారు. దాంతో, వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు.. లోక్సభలో ఆమోదం పొందింది. అనంతరం రాజ్యసభలోనూ వక్ఫ్ బిల్లుపై వాడివేడి చర్చ జరిగింది. అనుకూలంగా 128మంది.. వ్యతిరేకంగా 95మంది ఓటేయడంతో.. రాజ్యసభలో కూడా వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించడంతో.. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది.
వక్ఫ్ (సవరణ) బిల్లుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దముంటున్నాయి.. అయితే, చట్టసభల్లో ఓడిన విపక్షాలు న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, AIMIM, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వేర్వేరు పిటిషన్లతో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అంతేకాకుండా.. డీఎంకే.. టీఎంసీ, టీవీకే సహా దేశవ్యాప్తంగా విపక్షపార్టీలు నిరసన వ్యక్తంచేస్తున్నాయి..
ఈ కొత్త చట్టంపై ఆల్-ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) కూడా నిరసనలు వ్యక్తం చేస్తోంది. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం, శాంతియుత క్రియాశీలతను ప్రోత్సహించడం.. అనే అంశాలపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా ప్రచారాలు, నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది.
కాగా.. వక్ఫ్ కొత్త చట్టం పక్షపాతం, వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం, వక్ఫ్ ఆస్తులపై ఆక్రమణలను ఆపడానికి ప్రయత్నిస్తుందని.. ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని పాలక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం పేర్కొంది. ఈ చట్టం ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారిస్తుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఈ బిల్లు ఆమోదం అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లోపించిందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఇది ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లింలు, పస్మాండ ముస్లింల ప్రయోజనాలకు హాని కలిగించిందన్నారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాలు పారదర్శకతను పెంచుతాయి.. ప్రజల హక్కులను కూడా కాపాడతాయంటూ ప్రధానమంత్రి పేర్కొన్నారు.
బిల్లును సమర్థిస్తూ.. బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డులను జవాబుదారీగా చేయడం ద్వారా పారదర్శకతను తీసుకువస్తుందని అన్నారు. చట్టం వక్ఫ్ ఆస్తులను లాక్కుంటుందనే భయాలను తొలగించడానికి, ఏ మసీదు లేదా స్మశానవాటికను తాకబోమని అన్నారు.
కాగా.. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుతో సహా ఆరు నెలల చర్చల తర్వాత ఈ వక్ఫ్ సవరణను ప్రవేశపెట్టారు. వాడీవేడి చర్చల అనంతరం.. ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..