
విశాఖ మేయర్‌పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ నిర్వహించనున్నారు అధికారులు. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో.. ఎమ్మెల్యే వంశీ కృష్ణ రాజీనామాతో 21వ డివిజన్ స్థానం ఖాళీ అయింది. దీంతో 97 మంది కార్పొరేటర్లే ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యులైన ప్రజా ప్రతినిధులు 16 మంది ఉండగా వారిలో 11 మంది బలం కూటమికే ఉంది. ప్రస్తుతం టీడీపీకి 48 మంది కార్పొరేటర్లు, జనసేనకు 14 మంది కార్పొరేటర్లు, బీజేపీకి ఇద్దరు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి కూటమికి 75 వరకు సంఖ్యా బలం ఉంది. ఈ క్రమంలో కూటమి క్యాంప్ నుంచి ఒక కార్పొరేటర్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. మలేషియా నుంచి వస్తుండగా భూపతిరాజు సుజాత మిస్ అయ్యారు. వైసీపీ ఆపరేషన్‌తోనే కార్పొరేటర్ కనిపించకుండా పోయినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో విశాఖలోనే మకాం వేసిన మంత్రులు డోలా, అచ్చెన్నాయుడుతో పాటు స్థానిక ఎంపీ భరత్ కూడా చివరి నిమిషంలో ఎలాంటి ట్విస్ట్‌లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
లైవ్ వీడియో చూడండి..
పక్కా వ్యూహంతో ముందుకు..
అయితే.. విశాఖలో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది అధికార కూటమి. విశాఖలోని ఓ హోటల్లో 74 మంది కార్పొరేటర్లతో ఓ హోటల్లో కూటమి నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలను కార్పొరేటర్లకు వివరించారు ప్రజాప్రతినిధులు. ఆఖరి క్షణంలో కూటమికి మద్దతు ప్రకటించారు అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక, తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేల వారసుల చేరికతో కూటమికి మేజిక్ ఫిగర్ వచ్చింది. కూటమికి మద్దతు తెలిపే 74 మంది కార్పొరేటర్లు కాసేపట్లో కౌన్సిల్ హాల్‌కు చేరుకోనున్నారు. అవిశ్వాసం నెగ్గడానికి తగినంత బలం తమ దగ్గర ఉందంటున్నారు కూటమి నేతలు. అభివృద్ధిలో విశాఖను పరుగులు పెట్టించడానికే మేయర్‌పై అవిశ్వాసం పెట్టాల్సి వచ్చిందంటున్నారు పల్లా శ్రీనివాసరావు.
వైసీపీ విప్..
అయితే ఈ ప్రత్యేక సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. వైసీపీ గుర్తుపై గెలిచిన సభ్యులెవరూ సమావేశానికి హాజరుకావడానికి వీల్లేదంటూ విప్ కూడా జారీ చేసింది. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని పార్టీ ఆదేశించింది. ఎవరైనా ధిక్కరిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయంటూ పార్టీ విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసం నెగ్గుతుందా.. వీగుతుందా.. అనేది ఉత్కంఠగా మారింది.
భారీ ఏర్పాట్లు..
అధికార, విపక్షాలు పోటాపోటీ వ్యూహాలతో బిజీబిజీగా ఉంటే అటు అధికారులు మాత్రం కౌన్సిల్ సమావేశానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. అయితే కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు, జీవీఎంసీ ఉద్యోగులు మాత్రమే లోపలికి వచ్చేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. ఆ మేరకు ఇప్పటికే సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఐడెంటిఫికేషన్ అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్..ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతో పాటు మరిన్ని కెమెరాలను అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓటింగ్ ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేయాలని స్పష్టం చేశారు. కోరంకు సరిపడా సభ్యులు హాజరైతేనే ఓటింగ్ నిర్వహిస్తారు. అవిశ్వాస తీర్మానానికి సభ్యులు చేతులెత్తి తమ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. చేతులెత్తిన సభ్యుల సంఖ్యను లెక్కించి నమోదు చేయనున్నారు అధికారులు.