
ఐపీఎల్ ఆరంభానికి ముందు టీమిండియా దిగ్గజ క్రికెటర్, ఫేస్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్‌గా ఉన్న విరాట్ కోహ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్సీబీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ.. బీసీసీఐ తీసుకొచ్చిన ఫ్యామిలీ రూల్స్ గురించి మాట్లాడాడు. కోహ్లీ అంతటోడే ఈ రూల్స్ గురించి మాట్లాడుతూ అసంతృప్తి వ్యక్తం చేశాడంటే.. బీసీసీఐ రూల్స్ మార్చుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ బీసీసీఐ మాత్రం లేదు లేదు అంత సీన్ లేదు. కోహ్లీ చెప్పినంత మాత్రనా ఇక్కడ రూల్స్ ఏం మారిపోవు అంటూ క్లారిటీ ఇచ్చింది.
ఈ విషయంపై తాజాగా దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్‌దత్ సైకియా స్పందించారు. ఫ్యామిలీ పాలసీలో ఎటువంటి మార్పులు లేవని స్పష్టత ఇచ్చారు. ఐపీఎల్ తర్వాత జూన్, జులైలో టీమిండియా.. ఇంగ్లాండ్‌లో 5 టెస్టు మ్యాచులు ఆడనుంది. అప్పుడు కూడా బీసీసీఐ పెట్టిన ఫ్యామిలీ రూల్ ను ప్లేయర్స్ కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. “ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ పాలసీ మన దేశంతో పాటు, బీసీసీఐకి ఎంతో ముఖ్యం. ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పటి నుంచో ఈ రూల్స్ ఉన్నాయి.
ఈ రూల్స్ జట్టు సమన్వయం, ఐక్యత కోసం పెట్టినవే” అని సైకియా అన్నారు. రీసెంట్ గా ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణ ప్రదర్శన చేసింది. అందుకే ఆ తర్వాత నుంచి బీసీసీఐ ఆటగాళ్ల విషయంలో పలు కఠిన ఆంక్షలను విధించింది. గతంలో విదేశీ పర్యటనలో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు 45 రోజుల వరకు ఉండటానికి అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును రెండువారాలకే పరిమితం చేసింది. అయితే కోహ్లీ లాంటి ప్లేయర్ బహిరంగంగా రూల్స్‌పై పెదవి విరిచినా.. బీసీసీఐ ఇంత మొండిగా వ్యవహరించడంపై ఫ్యాన్స్ సైతం కాస్త హర్ట్ అవుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..