
ప్రస్తుతం పీక్ సమ్మర్ నడుస్తుంది. పాముల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చెట్లు ఎండిపోయి… ఎండలు, వేడి తాపానికి అవి జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల పాములు హల్చల్ చేస్తున్న ఘటనలు తరచుగా చూస్తున్నాం. ముఖ్యంగా కింగ్ కోబ్రా, తాచుపాము, రక్త పింజర, కట్లపాము వంటి వాటితో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాటువేస్తే.. ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో వైరల్గా మారింది. అందులో ఓ వ్యక్తి.. ఇంటి బయట ఉన్న బాత్రూంలో ఉండగా.. ఓ నాగుపాము లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ఆపై ఆ వ్యక్తిని చూసి బయటకు వెళ్లినట్లే వెళ్లి మళ్లీ లోపలికి వచ్చి పడగవిప్పింది. పాము దృశ్యాలను ఆ వ్యక్తి వీడియో తీసేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా మీదకు దూసుకు వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి తగ్గి.. బుసలు కొడుతూ పక్కనే ఉన్న ఓ మూలన నక్కింది. దీంతో ఆ వ్యక్తి జాగ్రత్తగా బాత్రూం డోర్ తీసి బతుకు జీవుడా అనుకుంటూ పరుగు లఖించుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు బ్రో అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వామ్మో నాకు అయితే అలా దాన్ని చూడగానే గుండె ఆగిపోయేది అని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు.
వీడియో దిగువన చూడండి…
తప్పించుకోవడానికి దారేదీ కనిపించని పరిస్థితుల్లోనే పాము మనిషిని కాటు వేస్తుందని.. పాములకు మనిషిని చూస్తే ఎంతో భయం అని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆందోళన చెందితే.. విషం త్వరగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. సాధ్యమైనంత త్వరగా బాధితుడ్ని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. కాటుపడిన తర్వాత ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..