
ఒక్కోసారి కొన్ని ఊహించని సంఘటనలు షాక్‌కు గురి చేస్తుంటాయి. ఫన్నీగా కూడా ఉంటాయి. అలాంటి సంఘటనే హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగింది. ఇది ఒక అసాధారణ సంఘటననే చెప్పొచ్చు. ఒక ఇంట్లో ఇద్దరు అనామక అతిథులు దూరడంతో ఆ ఫ్యామిలీ షాక్ అయింది. ఆ అనామక అతిథులు ఎవరో కాదు.. ఒకటి ఆవు అయితే మరొకటి ఎద్దు. ఏకంగా బెడ్రూమ్లోకి దూరేశాయి. మంచం ఎక్కి గంట సేపు అక్కడే గడిపాయి. ఫరీదాబాద్ NIT ప్రాంతంలో డబువా కాలనీలో జరిగిందీ సంఘటన. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆవు, ఎద్దు బెడ్రూమ్లోకి వెళ్లడంతో అక్కడే ఉన్న మహిళ భయంతో అల్మారా వెనక దాచుకుంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పొరుగింటివారు కర్రలు తీసుకుని వచ్చారు. వాటిని తరిమికొట్టడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. అయినా అవి వెళ్లకుండా దాదాపు గంటసేపు బెడ్రూమ్లోనే ఉన్నాయి. తరువాత ప్రజలు కర్రలతో బెడ్రూమ్లోకి ప్రవేశించి ఆవు, ఎద్దును బయటికి వెళ్లగొట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.
ఈ ఊహించని ఘటనపై ఆఇంటి యజమాని రాకేష్ సాహు స్పందించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి సభ్యులందరూ తమ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. అతడు ఇంటిని శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంది. అతని భార్య సప్న గదిలో పూజ చేస్తోంది. తల్లి వస్తువులు కొనడానికి దుకాణానికి వెళ్ళింది. పిల్లలు తమ అత్తను చూడటానికి వెళ్ళారు. ఆ సమయంలో ఒక ఆవు నేరుగా వారి బెడ్రూమ్లోకి పరిగెత్తింది. ఆవును వెతుక్కుంటూ ఒక ఎద్దు నేరుగా బెడ్రూమ్లోని మంచం మీదకు ఎక్కింది. ఇది చూసి కుటుంబ సభ్యులు భయపడిపోయారు. చుట్టుపక్కల ఉన్నవారు కర్రలతో రెండు జంతువులను తరిమికొట్టడానికి ప్రయత్నించడం ప్రారంభించారు.
జంతువులను బెడ్రూమ్ నుండి బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. అయినా కూడా రెండూ గది నుండి బయటకు రానప్పుడు, క్రాకర్లు పేల్చారు. వాటిపై నీళ్లు పోశారు. అయినా అవి కదలలేదు. సమీపంలో డెయిరీని నడుపుతున్న ఒక యువకుడు రెండు జంతువులను బయటకు తీసుకురావడానికి సహాయం చేశాడు. దాదాపు గంటసేపు ప్రయత్నించిన తర్వాత వాటిని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లారు.
ఈ ప్రాంతంలో ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని రాకేష్ సాహు అన్నారు. వీధిలో ఎద్దులు, ఆవుల మంద తరచుగా తమలో తాము పోట్లాడుకుంటాయి. దీని కారణంగా వీధుల్లో నిలిపి ఉంచిన వాహనాలు, దుకాణాలు దెబ్బతింటాయి. మున్సిపల్ కార్పొరేషన్‌కు చాలాసార్లు ఫిర్యాదులు అందాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై విచ్చలవిడిగా తిరిగే ఆవులను, ఎద్దులను గోశాలకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.