

కెన్యా రాజధాని నైరోబీలో ఒక సింహం జనావాసాల్లోకి వచ్చింది. దాడి చేసి ఓ బాలిక ప్రాణాలు బలిగొంది. నేషనల్ జూ పార్క్ నుంచి తప్పించుకున్న ఆ సింహం.. ఓ ఇంట్లోకి చొరబడింది. లోపల ఉన్న ఓ బాలికపై సింహం అమాంతం దూకి దాడి చేసింది. ఆ అమ్మాయిపై పంజా విసిరి అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. ఇదంతా బాలిక స్నేహితురాలి కళ్లెదుటే జరిగింది.
రక్తపు మరకల ఆధారంగా దగ్గరలోని బగాతి నది వద్ద బాలిక మృతదేహాన్ని కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ అధికారులు కనుగొన్నారు. వీపు భాగంలో తీవ్ర గాయాలపాలైనట్లు గుర్తించారు. సింహం దాడి కారణంగా బాలిక మృతి చెందినట్లు ప్రకటించారు. నైరోబీ నేషనల్ పార్క్ జనావాసాలకు కేవలం 10 కి.మీ దూరంలోనే ఉంది. అక్కడ నుంచి సింహం తప్పించుకుని ఉంటుందని భావిస్తున్నారు.
సింహం దాడి చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దాన్ని పట్టుకునేందుకు అధికారులు ట్రాప్ను ఏర్పాటు చేసారు. కంచెను దాటుకుని సింహం జనావాసాల్లోకి వచ్చినట్లు గుర్తించారు. దీంతో విద్యుత్ కంచెకు ఏర్పాట్లు చేసారు. క్రూర మృగాలకు ఆవాసమైన నైరోబీ నేషనల్ పార్క్ లో సింహాలు, పులులు, చిరుతలతో పాటు వివిధ రకాల జంతువులు ఉంటాయి.