
నల్లా నీళ్లలో నలకలు, బురద వస్తేనే మనకు వినియోగించాలనిపించదు. మనం ఉండే ప్రాంతాన్ని బట్టి మున్సిపల్ లేదా పంచాయతీ రాజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం. సమస్య పరిష్కారం అయ్యేవరకు దూరం అయినా మరో ప్రాంతానికి వెళ్లి నీరు తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ ఏకంగా ఓ పాము ఇంటికి ఇచ్చిన నల్లా కలెక్షన్ పైపులో దర్శనిమిచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. త్రిపుర రాష్ట్రంలో ఈ ఘటన వెలుగుచూసింది. అక్కడి టెలిమురాలోని కరోయిలాంగ్ శిషుబిహార్ ప్రాంతంలోని ఓ ఇంటికి ఏర్పాటు చేసిన నీటి సరఫరా కుళాయిలో చనిపోయిన పాము చిక్కుకుపోయింది. ఈ వార్త తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున ఆ ఇంటి వద్దకు వచ్చారు. ఇంటికి నీటి సరఫరా చేసే పైపు లోపల చనిపోయిన పాము కనిపించడంతో వారంతా బిత్తరపోయారు.
ఆ ఇంటిలో నివాసం ఉండే మహిళ మాట్లాడుతూ, “ఉదయం, నీటి సరఫరా పైపులో కొంత అడ్డంకిని మేము గమనించాము. నా భర్త కుళాయిని శుభ్రం చేయడానికి ప్రయత్నించినప్పుడు పైపు నుండి చనిపోయిన పాము బయటకు వచ్చింది. విషయం తెలియజేయడంతో స్థానికులు సైతం వచ్చి పరిశీలించారు .” అని ఆమె తెలిపారు.
అది చనిపోయిన పాము, నీటిలో నానిపోయి చర్మం ఊడిపోయిందని ఆమె వివరించింది. సరఫరా చేసే నీటిలో చిన్న చేపలు, రొయ్యలు కనిపించినప్పుడు మేము పట్టించుకోలేదని ఆమె చెప్పింది, “చిన్న చేపలు, రొయ్యలు మాత్రమే కనిపించినప్పుడు మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా కుళాయి నీటిలో పామే కనిపించింది. వారు సరఫరా చేస్తోన్న నీటి శుద్ధి సౌకర్యంపై మాకు తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. పూజకు సహా అన్ని రకాల గృహ పనులకు మేము ఈ నీటినే ఉపయోగిస్తాము.” అని ఆ మహిళ వాపోయింది.
ఈ విషయంపై సత్వర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేశారు. నీటి శుద్ధి కర్మాగారం సరగ్గా పనిచేయకపోతే వెంటనే మరమ్మత్తులు చేయించాలని సూచించారు. (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..