

విదుర నీతి మహాభారతంలో ధృతరాష్ట్రుడు, విదురుడి మధ్య జరిగిన సంభాషణల ఆధారంగా రూపుదిద్దుకుంది. దీనిలో జీవన విధానం గురించి మౌలిక సూత్రాలను చర్చించారు. విదుర నీతి మనకు 3 రకాల వ్యక్తుల నుండి ఎప్పుడూ దూరంగా ఉండాలని చెబుతుంది. వీరు మన పురోగతికి అడ్డంకులు కలిగించవచ్చు. ఇప్పుడు ఈ 3 రకాల వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.
మహాభారతంలో విభిన్న పాత్రలతో పాటు విదురుడి పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. అతను కౌరవుల సేవకుడైనప్పటికీ.. కౌరవుల అప్రజాస్వామిక విధానాలు, ధోరణులు కారణంగా పాండవులకు అనుకూలంగా నిలిచాడు. ఇతను ధృతరాష్ట్రుడు, పాండురాజుకు సోదరుడే అయినా.. రాజవంశంలో అతనికి సముచిత స్థానం ఇవ్వలేదు. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వచ్చినప్పుడు రాజభవనంలో కాకుండా.. విదురుడి గుడిసెలోనే విశ్రాంతి తీసుకున్నాడు. అతని జ్ఞానం, నిష్పాక్షికత, భక్తి వల్ల మహాత్మా విదురుడిగా ప్రసిద్ధి చెందాడు.
విదురుడు గొప్ప జ్ఞాన వేత్త, పండితుడు. అతను తన తండ్రి మహర్షి వేదవ్యాసుడి దగ్గర విద్యను అభ్యసించాడు. అతని ఆలోచనలు, విధానాలు, జీవన పద్ధతులు అంతటా ప్రసిద్ధి చెందాయి. మహాభారతంలో అతని సూచనలు, విధానాలు నేడు విదుర నీతి పేరిట ప్రసిద్ధి చెందాయి. ఈ నీతిలో సమయ నిర్వహణ, సత్సంగం, మానవ స్వభావం మొదలైన అంశాలను లోతుగా చర్చించారు.
విదుర నీతి ప్రకారం జీవితంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన 3 రకాల వ్యక్తులు ఉన్నారు. వీరిని ఎప్పుడూ దూరంగా ఉంచాలి. ఎందుకంటే వీరు మీ పురోగతిలో ఆటంకం కలిగిస్తారు.
ఇతరుల విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు ఎప్పుడూ ఇతరులకు హాని చేసే ప్రయత్నం చేస్తారు. వారు మీ ఎదుగుదల చూసి కుట్రలు పన్నవచ్చు. విదుర నీతిలో వీరిని దాగిన శత్రువులుగా పేర్కొన్నారు. వీరు మీ చుట్టూ ఉన్నవారే కావచ్చు. ఇంటి వారు లేదా స్నేహితులు కూడా మీ అభివృద్ధి చూసి అసూయపడే వ్యక్తులు కావచ్చు.
మోసగాళ్ళు, అబద్ధాలు చెప్పే వ్యక్తులు మీ నమ్మకాన్ని దెబ్బతీసి హాని చేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. వీరిని తొందరగా గుర్తించడం కొంచెం కష్టం అయినప్పటికీ.. వారి చేష్టలు చివరకు బయటపడతాయి.
సోమరితనంతో గడిపే వ్యక్తులు కూడా మీ పురోగతికి అడ్డంకి అవుతారు. వారు పనిని వాయిదా వేస్తూ ఉంటారు. దీనివల్ల ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి కాకపోవచ్చు. సోమరుల నుండి దూరంగా ఉండటం మీ పురోగతి వేగాన్ని రెట్టింపు చేస్తుంది.