బిగ్ బాష్ లీగ్ (BBL) అంటేనే రసవత్తర పోరుకు మారుపేరు. అయితే తాజాగా సిడ్నీ సిక్సర్స్ మరియు సిడ్నీ థండర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటతో పాటు ఒక వింత సంఘటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తన మెరుపు సెంచరీతో జట్టును గెలిపించిన స్టీవ్ స్మిత్, నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పాక్ స్టార్ బాబర్ ఆజంకు సింగిల్ ఇవ్వడానికి నిరాకరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ‘సిడ్నీ డెర్బీ’లో స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిడ్నీ థండర్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్మిత్ కేవలం 42 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బాబర్ ఆజంతో స్మిత్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
సిడ్నీ సిక్సర్స్ ఇన్నింగ్స్ సమయంలో బాబర్ ఆజం, స్టీవ్ స్మిత్ కలిసి బ్యాటింగ్ చేస్తున్నారు. స్మిత్ పూర్తి ఫామ్‌లో ఉండి బంతిని బౌండరీలకు తరలిస్తున్న సమయంలో, ఒకానొక దశలో సింగిల్ తీసే అవకాశం వచ్చినా స్మిత్ దానిని నిరాకరించాడు. బాబర్ ఆజం పరుగు కోసం పిలిచినా, స్మిత్ క్రీజులోనే ఉండిపోయి ‘నో’ అని సిగ్నల్ ఇచ్చాడు. సాధారణంగా క్రికెట్లో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆటగాడికి స్ట్రైక్ ఇవ్వడం సహజం, కానీ స్మిత్ తనే స్ట్రైక్ ఉంచుకోవాలని భావించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
స్ట్రైక్ తన వద్దే ఉంచుకోవాలని స్మిత్ పట్టుదల..
ఆ సమయంలో స్మిత్ చాలా వేగంగా ఆడుతున్నాడు. ఒకే ఓవర్లో 32 పరుగులు పిండుకుని మ్యాచ్‌ను సిక్సర్స్ వైపు తిప్పేశాడు. తాను అద్భుతమైన ఫ్లోలో ఉన్నందున, స్ట్రైక్ చేజారితే రన్ రేట్ తగ్గుతుందనే ఉద్దేశంతో లేదా తన సెంచరీ మైలురాయిని త్వరగా చేరుకోవాలనే పట్టుదలతో స్మిత్ అలా చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బాబర్ ఆజం ఆ సమయంలో 39 బంతుల్లో 47 పరుగులు చేసి కొంత నెమ్మదిగా ఆడుతున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్..
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు స్మిత్ గెలుపు కాంక్షను మెచ్చుకుంటుంటే, మరికొందరు బాబర్ వంటి స్టార్ ఆటగాడికి సింగిల్ ఇవ్వకపోవడం ఏంటని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, ఆ మ్యాచ్‌లో స్మిత్ వీరవిహారంతో సిడ్నీ సిక్సర్స్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్ కేవలం స్కోర్లు, వికెట్ల కోసమే కాకుండా స్మిత్-బాబర్ మధ్య జరిగిన ఈ చిన్నపాటి ‘స్ట్రైక్ వార్’ కారణంగా కూడా గుర్తుండిపోతుంది. అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజాలుగా పేరున్న వీరిద్దరూ ఒకే జట్టు (సిడ్నీ సిక్సర్స్) తరపున ఆడటం అభిమానులకు కన్నుల పండువగా నిలిచింది.
బీబీఎల్‌లో పాకిస్తాన్ ఆటగాళ్ల పరిస్థితి దారుణం..
బీబీఎల్‌లో పాక్ ఆటగాళ్లు అవమానం ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, సీజన్‌లోని రెండవ మ్యాచ్‌లో, పాక్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదిని మిడ్ ఓవర్ బౌలింగ్ నుంచి తొలగించారు. అతను కేవలం 2.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 43 పరుగులు ఇచ్చి, వికెట్ కూడా తీసుకోలేదు. ఆ సమయంలో, అతని మూడవ ఓవర్లో రెండు హై ఫుల్ టాస్‌లు వేయడంతో అంపైర్ అతన్ని మరింత బౌలింగ్ చేయకుండా అడ్డుకున్నాడు. ఇదిలా ఉండగా, కొన్ని రోజుల క్రితం, మహ్మద్ రిజ్వాన్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం వల్ల బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అవుట్ అయ్యాడు. ఇది కూడా అతనికి చాలా ఇబ్బంది కలిగించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
