
యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలపై జీఎస్టీ విధించబోతున్నారంటూ వచ్చిన వార్తలను కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఖండించింది. రూ.2000 పైబడి జరిపే లావాదేవీలపై జీఎస్టీ వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందంటూ వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవం అని పేర్కొంది. యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ అంటూ కొన్ని వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నేపధ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.
రూ.2 వేలు విలువ దాటిన లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందంటూ కొన్ని మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. అవన్నీ పూర్తి అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేవని వాటికి ఎలాంటి ఆధారం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి అంశం ఏదీ పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ తెలిపింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రమోట్ చేయడమే ముఖ్య ఉద్దేశ్యమని తేల్చి చెప్పింది.
జీఎస్టీ విధింపునకు సంబంధించిన నివేదికలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జనవరి 2020 నుండి, UPI P2M (వ్యక్తి నుండి వ్యాపారి) లావాదేవీలపై MDR (వ్యాపారి డిస్కౌంట్ రేటు) సున్నా అని తెలిపింది.వీటిపై GST వర్తించదని ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. మార్చి 19న, కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)ని ప్రోత్సహించడానికి ప్రోత్సాహక పథకాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించింది. ఈ పథకం మార్చి 31, 2026 వరకు కొనసాగుతుంది. దీని కోసం దాదాపు రూ. 1,500 కోట్లు ఖర్చు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద, చిన్న దుకాణదారులు రూపే డెబిట్ కార్డ్, BHIM-UPI ద్వారా రూ. 2,000 వరకు పర్సన్ టు మర్చంట్ (P2M) లావాదేవీలపై 0.15% ప్రోత్సాహకం పొందుతారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
భారతదేశంలో, RTGS , NEFT చెల్లింపు వ్యవస్థల నిర్వహణ RBI వద్ద ఉంది. IMPS, RuPay, UPI వంటి వ్యవస్థలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుంది. జనవరి 1, 2020 నుండి UPI లావాదేవీలకు జీరో-ఛార్జ్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. భారతీయ పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు UPI ద్వారా రూ.5 లక్షల వరకు పన్ను చెల్లింపులు చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పరిమితి లక్ష రూపాయలుగా ఉండేది. సెప్టెంబర్ 16 నుండి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని కోసం ప్రభుత్వం ఆగస్టు 24న ఒక సర్క్యులర్ జారీ చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..