
జనవరిలో యూపీఐ లావాదేవీలు 16.99 బిలియన్లను అధిగమించాయని, వీటి విలువ రూ.23.48 లక్షల కోట్లను అధిగమించిందని ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో కంటే భిన్నంగా జనవరి 2025లో లావాదేవీలు నమోదయ్యాయని పేర్కొంది. 2023-24 సంవత్సరం యూపీఐ లావాదేవీలు నెలనెలకూ మెరుగుపడుతున్నాయని వివరించింది. భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మూలస్తంభంగా ఉంది. దేశవ్యాప్తంగా 80 శాతం రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారా జరుగుతున్నాయంటే యూపీఐ క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.
2023-24 సంవత్సరానికి మొత్తం యూపీఐ లావాదేవీల పరిమాణం 131 బిలియన్లను దాటింది. అలాగే వీటి విలువ రూ.200 లక్షల కోట్లను దాటింది. యూపీఐ వాడుకలో సౌలభ్యం, భాగస్వామ్య బ్యాంకులు, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుతున్న నెట్‌వర్క్‌తో కలిపి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు యూపీఐను రియల్-టైమ్ చెల్లింపులకు సంబంధించిన ప్రాధాన్యత మోడ్‌గా మార్చిందని నిపుణులు చెబుతున్నారు. జనవరి 2025 నాటికి 80కి పైగా యూపీఐ యాప్‌లు, 641 బ్యాంకుల ద్వారా ఈ స్థాయి యూపీఐ లావాదేవీలు సాధ్యమయ్యాయని వివరిస్తున్నారు.
2025 జనవరి వరకు మొత్తం యూపీఐ లావాదేవీల్లో పీపుల్ టు మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలు 62.35 శాతం ఉన్నాయి. అలాగే పీ2పీ లావాదేవీలు 37.65 శాతం ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. 2025 జనవరిలో పీ2ఎం లావాదేవీల సంఖ్య 62.35 శాతానికి చేరుకుంటే ఈ లావాదేవీల్లో 86 శాతం రూ. 500 కంటే చిన్న మొత్తాలే ఉన్నాయని తెలిపింది. తక్కువ విలువ చెల్లింపులకు కూడా యూపీఐ పని చేస్తుందనే నమ్మకం ప్రజల్లో కలగడం వల్లే ఈ లావాదేవీలు పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి