ప్రస్తుతం దేశంలో యూపీఐ వినియోగం పెరిగింది. రోడ్డు పక్కన ఉండే చిన్న షాపుల నుంచి షాపింగ్స్ మాల్స్ వరకు ప్రతీఒక్కరూ యూపీఐ ద్వారా కస్టమర్ల నుంచి పేమెంట్స్ స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. పూర్తిగా ఉచితంగా ఈ సేవను వాడుకోవచ్చు. కానీ యూపీఐను నిర్వహించాలంటే తమకు నిర్వహణ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని ఫిన్ టెక్ కంపెనీలు కోరుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సహకాలు తగ్గడం వల్ల తమకు భారం అవుతున్నాయని ఆరోపిస్తున్నాయి. తమకు స్థిరమైన ఆదాయం లేక యూపీఐ సేవలను కొనసాగించడం కష్టంగా మారిందని ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ ఫ్లాట్ ఫామ్స్ ఆందోళన చెందుతున్నాయి.
తగ్గిన ప్రభుత్వ సబ్సిడీలు
యూపీఐ నెట్వర్క్ను నడపడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహరమని, టెక్నాలజీ మౌలిక సదుపాయాలు, సర్వర్ల మెయింటనెన్స్, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, కస్టమర్ల ఆన్ బోర్డింగ్ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఫిన్ టెక్ సంస్థలు చెబుతున్నారు. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు ప్రోత్సాహకం అందుకున్నప్పటికీ.. ఖర్చులకు సరిపోవడం లేదని చెబుతున్నాయి. ఇక 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 1500 కోట్లకు ప్రోత్సాహకం తగ్గిందని, ప్రస్తుతం బడ్జెట్లో 427 కోట్లు మాత్రమ కేటాయించిందని చెబుతున్నాయి కంపెనీలు. అలాగే యూపీఐ ప్రస్తుత మోడల్ నిలకడగా లేదని పేమెంట్స్ కార్పొరేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా హెచ్చరించింది. త్వరలో పరిష్కార కనిపెట్టకపోతే ఫిన్ టెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను గ్రామీణ, చిన్న పట్టణాలకు మాత్రమే పరిమితం చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
భవిష్యత్తులో ఛార్జీలకు ఛాన్స్
ప్రభుత్వం సబ్సిడీలను పెంచాలని లేదా మర్చంట్ డిస్కౌంట్ రేటు అమలుకు అనుమతించాలని కంపెనీలు కోరుతున్నాయి. చిన్న దుకాణాదారులు, సామాన్యులు ఉచితంగా యూపీఐ సేవలను వినియోగించుకోవాలనేది ప్రతిపాదన కాగా.. రూ.10 కోట్ల కంటే ఎక్కకు వార్షిక టర్నోవర్ కలిగిన పెద్ద వ్యాపారుల నుంచి 0.25 శాతం నుంచి 0.30 శాతం వరకు మర్చంట్ ఛార్జీలు వసూలు చేసేలా అనుమతించాలని కోరుతున్నాయి. త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో దీని గురించి కంపెనీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో యూపీఐ సేవలు వినియోగించుకోవాలంటే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
