
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దీనిలో పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు . కానీ రద్దుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2020 బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. పాత పన్ను విధానంలో ఉండే మినహాయింపులు, తగ్గింపులు దీనిలో తొలగించారు. అయితే ట్యాక్స్ రేట్లు మాత్రం పాత విధానంలో కన్నా తగ్గించారు. పాత, కొత్త పన్ను విధానాల్లో తమకు అనుకూలమైన దాన్ని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎంపిక చేసుకోవచ్చు.
పాత పన్ను విధానంలో పలు పథకాల్లో పెట్టుబడులు, హెల్త్ బీమా ప్రీమియాలు, హోం లోన్లపై ఆదాయపు పన్ను చట్టంలోని 80 సీ సెక్షన్ ప్రకారం పన్ను మినహాయింపులు ఇచ్చారు. వాటిని కోరుకునేవారు పాత విధానంలోనే ట్యాక్స్ కడుతున్నారు. ముఖ్యంగా హోమ్ రుణాలపై ఆదాయపు ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవడానికి కొత్త పన్ను విధానం కన్నా పాత విధానంలో ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ విధానం రద్దయితే రియల్ ఎస్టేట్ రంగానికి ఇబ్బందులు కలుగుతాయని భావిస్తున్నారు. దానికి గల కారణాలు ఈ కింద విధంగా ఉన్నాయి
ఇవి కూడా చదవండి
- దేశంలో రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 493 బిలియన్ల డాలర్ల విలువతో కొనసాగుతోంది. దేశ జీడీపీకి 7.3 శాతం దోహదం చేస్తుంది. ఇటీవల వెల్లడైన నివేదిక ప్రకారం.. 79 శాతం మంది ఇళ్లను కొనుగోలు చేయడానికి హోమ్ రుణాలపై ఆధారపడుతున్నారు. ఆ రుణాలకు అందించే ఆదాయపు పన్ను మినహాయింపులను లెక్కవేసుకుని వారందరూ రుణాలు తీసుకుంటారు. పాత పన్ను విధానం రద్దు చేస్తే వీరి కొనుగోలు సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
- పట్టణ ప్రజల హౌసింగ్ డిమాండ్లను తీర్చడానికి 2030 నాటికి రియల్ ఎస్టేట్ రంగానికి 25 మిలియన్లకు పైగా ఇళ్ల యూనిట్లు అవసరమవుతాయి. హోసింగ్ రుణాలపై పన్ను మినహాయింపులు తగ్గితే మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేదు. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి రియల్ ఎస్టేట్ రంగం ఉపాధి చూపుతుంది. జాతీయ ఉపాధిలో దీని వాటా 18 శాతంగా ఉంది. 2047 నాటికి ఈ రంగం 5.8 ట్రిలియన్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ఇది మన దేశ జీడీపీకి 15.5 శాతం దోహదం చేస్తుంది.
- బ్యాంకింగ్ రంగానికి కూడా హౌసింగ్ రుణాలు చాలా కీలకం. 2015లో రూ.6.3 ట్రిలియన్లగా ఉన్న రుణాలు 2024 ఆగస్టు నాటికి రూ.28.3 ట్రిలియన్లకు పెరిగాయి. పన్ను ప్రయోజనాలను తీసివేయడం వల్ల హౌసింగ్ రుణాలు తీసుకునే వారు తగ్గిపోయి, బ్యాంకులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి