
సరిగ్గా ఉగాది రోజునే శని మీన రాశిలోకి మారడం జరుగుతోంది. ఏప్రిల్ లో బుధ, కుజ, రవులు, మేలో రాహుకేతువులు, గురువు కూడా రాశి మారబోతున్నాయి. ఉగాదితో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతున్నందువల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదనే ఆలోచన రావడం సహజం. కొత్త సంవత్సరంలో తాము ఎదుర్కోబోయే సమస్యలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాటికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మీన రాశులవారు తమకు ఎదురు రాబోయే సమస్యలను దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా కొన్ని నిర్ణయాలు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
- మేషం: ఈ రాశికి ఈ గ్రహాల రాశి మార్పు వల్ల ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. మే తర్వాత నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చేయడం, కాస్తో కూస్తో మదుపు చేయడం చాలా అవసరం. ఆదాయానికి మించి ఖర్చులుండే అవకాశం ఉంది. ఇతరుల విషయాల కంటే సొంత విషయాల మీద శ్రద్ద పెట్టడం ఉత్తమం. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. వైద్య ఖర్చులు పెరగవచ్చు.
- మిథునం: ఈ రాశివారు ఉద్యోగపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో పొర పాట్లు చోటు చేసుకోవడం, పని భారంతో అవస్థలు పడడం, అధికారులతో అపార్థాలు తలెత్తడం వంటివి జరిగే అవకాశం ఉన్నందువల్ల ఓర్పు, సహనాలతో, సానుకూల దృక్పథంతో వ్యవహ రిం చడం మంచిది. నిరుద్యోగులు తమకు అందిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం మారకపోవడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు రాకుండా చూసుకోవడం ముఖ్యం.
- సింహం: ఈ రాశికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, అజమాయిషీలో లోపభూయిష్టంగా కొనసాగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంపత్య జీవితంలో తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి.
- కన్య: ఈ రాశికి ప్రధాన గ్రహాల అనుకూలత తగ్గుతున్నందువల్ల ఉద్యోగ జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పొరపాట్లు ఎక్కువగా దొర్లే అవకాశం ఉంది. అధికారుల ఆగ్రహానికి లేదా విమర్శలకు గురయ్యే సూచనలున్నాయి. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. వైవాహిక జీవితంలో కొద్దిగా అపార్థాలు తలెత్తవచ్చు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
- ధనుస్సు: ఈ రాశికి కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. వారి మీద ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు ముదిరే సూచనలున్నాయి. సొంత ఇల్లు కొనుగోలు విషయం ఒక పట్టాన ముందుకు సాగదు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గినా ఓపికగా వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది.
- మీనం: ఈ రాశివారు ఆదాయ వ్యయాల మీద ఒక కన్ను వేసి ఉండడం అవసరం. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా తగ్గుతుంది. బాగా సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు దిగకపోవడం శ్రేయస్కరం.