
కల్తీ నెయ్యికి కళ్ళెం వేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.
కల్తీ నెయ్యికి టీటీడీ ఇక చెక్ పెట్టనుంది. నెయ్యిలో వంద శాతం కల్తీని గుర్తించే యంత్రాలను సమకూర్చుకుంది.
రూ. 70 లక్షల విలువైన జర్మనీ టెక్నాలజీ మిషన్ల ను ఎన్డీడీబీ విరాళంగా ఇవ్వడంతో ఇక కల్తీ మాటకు నో ఛాన్స్ అంటోంది టీటీడీ.
తిరుమల లడ్డు లో కల్తీ నెయ్యి వ్యవహారం దేశంలో సంచలనానికి కారణం అయింది. రాజకీయంగా కూడా కలకలం రేపింది. హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంగా చర్చకు దారితీసింది. సర్వోన్నత న్యాయస్థానం వరకు చేరింది. ఇందులో భాగంగానే సిట్ ఎంక్వయిరీ షురూ అయ్యింది. 5 మంది సభ్యుల సిట్ టీం కల్తీ నెయ్యి వ్యవహారాన్ని నిగ్గు తేల్చే పనిలో ఉంది. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ లో కల్తీ నెయ్యిని వాడినట్లు NDDB కాఫ్ నివేదిక ఇచ్చిన రిపోర్టు ను బయట పెట్టిన టీటీడీ ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ నుంచే విరాళంగా రెండు జర్మనీ టెక్నాలజీ యంత్రాలను సమకూర్చుకుంది.
టీటీడీలో కల్తీ నెయ్యికి కళ్లెం వేసేలా నూతన పరికరాలు అందుబాటులోకి వచ్చినట్లయింది. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు రూ 70 లక్షల విలువైన పరికరాలను జర్మనీ నుంచి తెప్పించి తిరుమలకు చేర్చింది. తిరుమలలోని పిండిమర లోని టీటీడీ ల్యాబ్ లో ఏర్పాటు చేసింది. వచ్చేనెల నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించేందుకు అవకాశం ఏర్పడనుంది. టీటీడీ శ్రీవారి ప్రసాదాలు, ఇతర అవసరాల కోసం రోజూ 14 వేల కేజీల నెయ్యిని వినియోగిస్తోంది. వేట దాదాపు 5 వేల టన్నుల నెయ్యిని కొనుగోలు చేస్తుండగా ఇందుకోసం దాదాపు రూ. 200 కోట్లు ఖర్చు పెడుతోంది. అయితే నెయ్యిలో కల్తీని గుర్తించేందుకు అత్యాధునికమైన పరికరాలు టీటీడీ ల్యాబ్ లో అందుబాటులో లేకపోవడంతో నెయ్యిలో కల్తీ వ్యవహారం వెలుగు చూసింది.
వంద శాతం కల్తీ ని గుర్తించే టెక్నాలజీ పరికరాలు ఉన్న ల్యాబ్ లలో పరీక్షించాకే అసలు విషయం వెలుగు చూడడంతో ఇప్పుడు నూతన పరికరాలతో టీటీడీ ల్యాబ్ సిద్ధమైంది. లడ్డూ ప్రసాదాలకు వినియోగించే నెయ్యి కల్తీపై ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరోసారి ఉత్పన్నం కాకుండా ఉండేలా యాక్షన్ ప్లాన్ లోకి దిగింది. తిరుమలలోని ల్యాబ్ కు నెయ్యిని వంద శాతం పరీక్షించే సామర్థ్యం లేదని, ల్యాబ్లో ఉన్న యంత్రాలతో మాయిశ్చరైజ్, కెమికల్ అనాలసిస్, రిపోర్ట్ ఇండెక్స్ లాంటి ప్రాథమిక పరీక్షలు మాత్రమే చేయగలిగే సామర్థ్యం ఉందని నిపుణుల నివేదిక తేల్చడంతో టీటీడీ అత్యాధునిక టెక్నాలజీ గల పరికరాలతో ల్యాబ్ ఏర్పాటు చేయాలని భావించింది.
సూక్ష్మస్థాయిలో నెయ్యిని పరీక్షించేందుకు కావాల్సిన పరికరాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించిన టిటిడి దీనికోసం ఫ్యాటీ ఆసిడ్ మైబెల్ ఎస్టర్, బీబా-సిటోస్టెరాల్ వంటి పరీక్షలకు గ్యాస్ క్రోమాటోగ్రాఫ్ (జీన్), హై ఫెర్ఫార్మన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రాప్ (హెచ్పీఎల్ సి) అనే రెండు యంత్ర పరికరాలు అవసరమని గుర్తించింది. ఈ మేరకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ రూ.70 లక్షల విలువైన పరికరాలను విరాళంగా ఇచ్చేందుకు నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డ్ అంగీకరించడంతో ఎట్టకేలకు జర్మనీ నుంచి తిరుమల ల్యాబ్లో ఏర్పాటు చేసేందుకు వీలైంది. నెయ్యి నమూనాలను పరీక్షించేందుకు ఇప్పటికే సిబ్బందికి కూడా ప్రత్యేక శిక్షణ NDDB ఇవ్వడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ రెగ్యులేషన్ (ఎఫ్ఎస్ఎస్ఆర్) నిబంధనల ప్రకారం నెయ్యిని పూర్తిస్థాయిలో పరీక్షించే స్థాయికి టీటీడీ ల్యాబ్ చేరుకుంది. వచ్చేనెల నుంచి ఈ ల్యాబ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా టీటీడీ సమాయత్తం అవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి