
తిరుమల శ్రీవారి ఆదాయం.. అంతకంతకూ పెరుగుతోంది. ఓవైపు హుండీ, మరోవైపు డిపాజిట్లపై వస్తున్న వడ్డీ, ఇంకోవైపు భారీ విరాళాలతో తిరుమలేశుడు పెద్ద సంపన్నుడయ్యాడు. వార్షిక బడ్జెట్ ముందు టీటీడీ వేసిన లెక్కలు… బడ్జెట్ తర్వాత అధికారుల అంచనాలు చూస్తుంటే.. శ్రీవారు నిజంగా ‘వడ్డీ’కాసులవాడే అనిపిస్తోంది..! అలాగే.. కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అన్నట్లుగా ఉంది శ్రీవారి ఆదాయ చిట్టా..!
కలియుగంలో అపరకుభేరుడు.. తిరుమల వేంకటేశ్వరుడే. ఏటేటా శ్రీవారి ఆదాయం పెరుగుతూ పోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్‌నూ పెంచేస్తోంది. ఇటు హుండీ, అటు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూపంలో ఏడుకొండవారి ఆస్తుల విలువ కొండంత అవుతోంది. అలాగే… విరాళాలూ ఏమాత్రం తగ్గట్లేదు. తిరుమలేశుడి హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. కొండంతగా మారుతుంది. గత ఏడాది వార్షిక ఆదాయంలో హుండీనే ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. ప్రతి నెలా రూ.100 కోట్ల పైమాటే గా ఉన్న హుండీ ఆదాయం రికార్డులను బద్దలు కొడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారానే టీటీడీ కి వచ్చిన రూ. 1,700కోట్లకు పైగా ఆదాయం తిరుమల వెంకన్న ఖాతాకు చేరింది. ఈ ఏడాది హుండీ టార్గెట్ రూ.1729 కోట్లుగా ఉంది.
తిరుమలేశుడు.. అపర కుబేరుడు.. వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడు. ఏటేటా పెరుగుతున్న వెంకన్న ఆదాయంలో హుండీదే పైచేయిగా నిలిచింది. మార్చి నెల 25వ తేదీన టీటీడీ వార్షిక బడ్జెట్ లోనూ ఇదే విషయం స్పష్టమైంది. 2025-26 వార్షిక బడ్జెట్ లో రాబడి ఆదాయాన్ని లెక్క కట్టిన టీటీడీ ప్రధాన ఆదాయ వనరుగా హుండీ నేనని తేల్చింది. 2024-25 ఏడాది టిటిడి బడ్జెట్ 5,179.85 కోట్లు కాగా హుండీ ఆదాయం రూ. 1,701.67 కోట్లు వచ్చింది. ఈ లెక్కలు పక్కన పెడితే బడ్జెట్ లో ప్రధాన అంకె శ్రీవారి హుండీ ఆదాయమే నిలిచింది. ఇక ఈ ఏడాది హుండీ ఆదాయం రూ. 1,729 కోట్ల మేర ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది.
టీటీడీ బడ్జెట్లో సింహభాగం ఆదాయం హుండీ ద్వారానే వెంకన్నకు ఆదాయం సమకూరుతోందన్న విషయం స్పష్టమవుతోంది. కోవిడ్ కు ముందు రూ. 900 నుంచి రూ. 1,000 కోట్లలోపే లోపే ఉండే హుండీ ఆదాయం గత నాలుగేళ్లుగా అంతకంతకు పెరుగుతోంది. కోవిడ్ అనంతరం భారీగా పెరిగిన వెంకన్న ఆదాయం క్రమక్రమంగా రెట్టింపు అయింది. 2022-23 బడ్జెట్లో హుండీ ద్వారా రూ. వెయ్యి కోట్లు లభిస్తుందని అంచనా వేసిన టీటీడీ ఊహించని విధంగా రూ.1,613 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇక 2023-24 ఏడాదిలో రూ. 1,611 కోట్లు, 2024-25 గాను ఇప్పటిదాకా రూ. 1671 కోట్ల ఆదాయం హుండీ ద్వారా టీటీడీకి లభించింది.
ఇక ప్రతి రోజూ 60 వేల మందికి తక్కువ కాకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకోనుండగా హుండీ ఆదాయం సగటున రూ. మూడున్నర కోట్ల పైమాటే ఉంటుంది. ఈ లెక్కన 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు శ్రీవారి ఆలయంలో భక్తులు హుండీ లో సమర్పించిన కానుకలను పరిశీలిస్తే మొత్తం రూ. 13,45,98,56,879 లు టీటీడీకి చేరింది. 2024 ఏప్రిల్ నెలలో రూ 1.01 కోట్లు, మే నెలలో రూ 1.08 కోట్లు, జూన్ నెలలో రూ 1.13 కోట్లు, జూలై నెలలో రూ 1.25 కోట్లు, ఆగస్టు నెలలో రూ 1.25 కోట్లు, సెప్టెంబర్ నెలలో రూ 1.14 కోట్లు, అక్టోబర్ నెలలో రూ 1.07 కోట్లు, నవంబర్ నెలలో రూ 1.11 కోట్లు, డిసెంబర్ నెలలో రూ 1.14 కోట్లు, 2025 జనవరి నెలలో రూ 1.06 కోట్లు, ఫిబ్రవరి నెలలో రూ కోటి, మార్చి నెలలో రూ 1.16 కోట్లు, ఇలా 2024 25 వార్షిక సంవత్సరం వెంకన్న ఉండి ఆదాయం రూ 1345.98 కోట్లు గా టీటీడీ ప్రకటించింది.
ఇది తిరుమల ఆలయంలోని హుండీ ఆదాయం మాత్రమే కాగా టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాలు, ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లోని హుండీ ఆదాయాన్ని లెక్క కడితే హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకల విలువ రూ. 1,701.67 కోట్లుగా టీటీడీ పేర్కొంది. అంతకంతకు పెరుగుతున్న హుండీ ఆదాయం ఈ ఏడాది రూ. 1,729 కోట్ల మేర ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది.
ఇక ఇవే ట్రెండ్స్ కంటిన్యూ అయితే… 2025-2026 సంవత్సరానికి గానూ అంచనాలు మించిపోవచ్చంటోంది టీటీడీ. ఎప్పుడూ చూడని అమౌంట్‌తో రికార్డ్ బ్రేక్ కావడం ఖాయమని చెబుతోంది. కేవలం వడ్డీలు, హుండీ ఆదాయం మాత్రమే కాదు.. దర్శనాల ద్వారా 310 కోట్లు, ప్రసాదాల ద్వారా కూడా రూ. 600 కోట్ల మేర ఆదాయం పెరిగే ఛాన్స్ ఉందంటూ లెక్కలేస్తోంది టీటీడీ. మరి చూడాలి… శ్రీవారి ఇన్కమ్ స్కోర్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో…!
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..