
టమాట ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. నిన్నా మొన్నటి వరకు సామాన్యులను చుక్కలు చూపిన టమాటా ధర.. ఇప్పుడు రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఛాయ్ కంటే చీప్‌గా మారిపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే టమాటాలను ఖరీదు చేసి రకరకాల నిల్వ పచ్చళ్ళు చేసుకుంటారు కొందరు. అయితే తక్కువ ధర ఉన్నప్పుడు టమాటా ను కొనుగోలు చేసి పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే వంటల్లో ఉపయోగించుకోవచ్చు. టమాటా ధర ఎక్కువగా ఉన్నప్పుడు.. ఇలా నిల్వ చేసుకున్న టమాటా పొడిని ఉపయోగించుకోవచ్చు. టమాటా ధర తక్కువగా ఉన్నప్పుడు నెలల పాటు నిల్వ ఉండే టమాటా పొడిని తయారు చేసుకోండి. ఈ టమాటా పొడితో కూరలు, రసం, పప్పు వంటివి తయారు చేసుకోవచ్చు. ఈ రోజు నెలల పాటు నిల్వ ఉండే టమాటా పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
- ముందుగా శుభ్రమైన టమాటాలను ఎంచుకోవాలి. అంటే టమాటాలు మరీ పచ్చిగా ఉండరాదు. అదే విధంగా బాగా పండిన టమాటాలు కూడా పని రావు. కనుక టమాటా పొడిని తయారు చేసుకోవడానికి మెత్త పడని.. దోర టమాటాలను ఎంచుకోవాలి.
- టొమాటలను నీటిలో వేసి శుభ్రంగా కడిగి.. తడి లేకుండా తుడవాలి.
- ఒక క్లాత్ మీద ఆ టమాటాలను పోసి.. కొంచెం సేపు గాలికి ఆరబెట్టండి.
- తర్వాత టమాటాలను సన్నని పొడవైన ముక్కలుగా కట్ చేసుకోవాలి,
- ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుని దానిపై ఒక కాటన్ క్లాత్ వేసి.. దానిపై సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు పోయాలి
- ఇప్పుడు ఈ టమాటా ముక్కలను ఎండలో పెట్టాలి. రాత్రి తేమ చేరకుండా ఫ్యాన్ కింద పెట్టుకోవాలి.
- ఈ టమాటా ముక్కలు తడి లేకుండా ఎండిపోయే వరకూ ఎండలో పెట్టి ఒరుగులుగా చేసుకోవాలి.
- ఒక టమాటా ముక్కని విరిచి చూడండి.. తడి లేకుండా టమాట ముక్కలు ఎండిపొతే.. ఆ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోండి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పొడిని తడి లేని, గాలి చొరబడని గాజు సీసాలో వేసి.. ఈ సీసాని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.
- ఈ టమాటా పొడి నెలల పాటు నిల్వ ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఎప్పుడైనా టమాటా ధరలు పెరిగితే ఆ సమయంలో టమాటా పొడిని ఉపయోగించి పప్పు, రసం, చారు, కూర ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ధర ఎలా తక్కువగా ఉంది.. కనుక ఈ టమాటా పొడిని రెడీ చేసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..