
2025 ప్రారంభమై అప్పుడే మూడు నెలలు అయ్యింది. ‘ ఛావా ‘ సినిమా తప్ప, మరే సినిమా పెద్ద సంచలనం సృష్టించలేదు. నిజానికి, 2025 లో చాలా పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. కానీ ఆ సినిమాలు ఇంకా విడుదల కాలేదు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం అత్యంత ఆసక్తికర చిత్రాల జాబితాను IMDB విడుదల చేసింది. కన్నడ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. IMDb ప్రకారం, రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన హోంబాలే నిర్మించిన ‘కాంతార: చాప్టర్ 1’ ఈ సంవత్సరం తెరపైకి రానుంది. యష్ హీరోగా, గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ‘టాక్సిక్’ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది.
ఈ జాబితాలో తమిళ చిత్రం ‘జన నాయగన్’ మూడవ స్థానంలో ఉంది. దళపతి విజయ్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. నాల్గవ స్థానంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘సికంధర్’ చిత్రం ఉంది. సల్మాన్ ఖాన్ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియాద్వాలా ఈ చిత్రానికి నిర్మాతంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ’ చిత్రం ఉంది.
ప్రభాస్ సినిమాలే..
కాగా ఈ జాబితా టాప్-10లో తెలుగు సినిమాలకు చోటు దక్కలేదు. ప్రభాస్ ది రాజా సాబ్ ఈ లిస్టులో 13వ స్థానంలో ఉంది. అలాగే ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమా సలార్ 2 కూడా 17వ స్థానంలో ఉంది. ఇక ప్రభాస్ – హను రాఘవ పూడి ప్రాజెక్టు ఫౌజి (వర్కింగ్ టైటిల్) 18వ స్థానంలో ఉండగా, అడివి శేష్ గూఢచారి 20వ ప్లేస్ లో ఉంది. ఇక పవన్ కల్యాణ్ ఓజీ, నాగార్జున కుబేర, చిరంజీవి విశ్వంభర, పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు, రామ్ చరణ్ ఆర్ సీ 17 తదితర సినిమాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఐఎండీబీ పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి