
ఆ ముఠా ఆలయాల వద్ద ఉండే ఒంటరి భక్తులనే టార్గెట్ చేసింది. ఒంటరి భక్తులను గుర్తించడం వారితో మాట మాట కలపడం ఆ తరువాత నిలువు దోపిడీ చేయడమే పనిగా పెట్టుకుంది. మత్తు మందు ఇచ్చి స్పృహ కొల్పోయాక దోచుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇలా పలు ఆలయాల వద్ద ఇలాంటి నేరాలకే పాల్పడ్డ తమిళనాడుకు చెందిన ముఠా తిరుమల వెంకన్న క్షేత్రంలోనూ ఇదే పని చేసింది. అడ్డంగా దొరికి పోయింది. తమిళనాడులోని మూడు జిల్లాల్లో ఇలాంటి పలు నేరాలకు పాల్పడి అక్కడ తప్పించుకున్నా.. వడ్డీ కాసుల వాడి చెంత మాత్రం ఎస్కేప్ కాలేకపోయింది. ప్రముఖ ఆలయాల వద్ద ఒంటరి మహిళలను ట్రాప్ చేస్తున్న తమిళనాడుకు చెందిన ముఠాను తిరుమల వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ముఠాగుట్టు రట్టయింది.
గత జనవరి 5 న తిరుమలలో శ్రీవారి రథం వెనుక గ్యాలరీ ఉన్న ఒంటరి మహిళను క్యాచ్ చేసిన ముఠా శ్రీవారి దర్శనం చేయిస్తామని మాయ మాటలు చెప్పి కలుపుగోలుగా వ్యవహరించింది. ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి మత్తులోకి జారుకున్నాక ఒంటరి మహిళ మెడలో ఉన్న నగలు, చెవి దిద్దులను ముఠా కాజేసింది. తిరువన్నామలై జిల్లా విల్లుపురంకు చెందిన 65 ఏళ్ల శారద ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించగా ఆమె అక్క కొడుకు విజయ్ కుమార్ కీలకంగా వ్యవహరించాడు. ఈ మేరకు తిరుమల వన్ టౌన్ పిఎస్‌లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన వన్ టౌన్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించి అనుమానితుల ఫోటోలను సేకరించారు. తమిళనాడు గ్యాంగ్‌గా అనుమానించి పలు పోలీస్ స్టేషన్లలోని క్రైమ్ రికార్డ్ బ్యూరోలను సంప్రదించారు. వారి ఫోటోల ఆధారంగా పాత నేరస్తులుగా గుర్తించారు. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా విల్లుపురంకు చెందిన ముఠాగా గుర్తించారు. ఆపై కాంచీపురం సమీపంలోని అబ్దుల్లాపురంలో ఉన్నట్లు గుర్తించిన తిరుమల పోలీసులు విల్లుపురం తాలూకా వాలిధ రెడ్డి గ్రామానికి చెందిన 33 ఏళ్ల విజయకుమార్, 65 వీళ్ళ శారదలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి21 గ్రాముల బంగారం, రూ 45 వేలు నగదు, 3 మొబైల్స్, నిద్ర మాత్రలు స్వాదీనం చేసుకున్నారు.
దేవాలయాల వద్ద కాపు కాచి వయసు మళ్లిన మహిళలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాపై తమిళనాడులోని మూడు జిల్లాల్లో కేసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడు నుండి మూడు జిల్లాల పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు గాలిస్తుండగా చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ తాజాగా తిరుమల పోలీసులకు పట్టుబడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..