
ఇడుక్కి, మార్చి 18: కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియార్లో సోమవారం అటవీ అధికారులు ఓ పులిని చంపారు. పులిని పట్టుకోవడానికి వెళ్లిన అటవీ అధికారులపై అది ఒక్కసారిగా దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం దానిని కాల్చి చంపారు. గ్రాన్బీ ఎస్టేట్ ప్రాంతం నుంచి ఇటీవల సమీప జనావాసాల్లోకి ఓ పెద్ద పులి వచ్చి, అక్కడి పెంపుండు జంతువులు, పశువులను చంపుతుంది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద పులిని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ టీ ఎస్టేట్‌లో పులి కనిపించడంతో దానికి మత్తుమందు ఇవ్వడానికి ట్రాంక్విలైజర్ షాట్లు ఇచ్చారు. మొదట 15 మీటర్ల దూరం నుంచి ఈ కాల్పులు జరిపడంతో అది గురితప్పింది. రెండవ ట్రాంక్విలైజర్ షాట్ విజయవంతంగా పేల్చినా.. ఇంతలో పులి ఒక్కసారిగా వారిపై దూకి దాడి చేసింది. ఆత్మరక్షణ కోసం సిబ్బంది దానిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పెద్ద పులి మృతి చెందినట్లు అటవీశాఖ సీనియర్ అధికారులు వెల్లడించారు. ట్రాంక్విలైజర్ షాట్ తీసుకున్న తర్వాత అకస్మాత్తుగా పులి వారిపైకి దూకడంతో సిబ్బందిలో ఒకరి డాలును పులి చింపివేసిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘పులికి మత్తుమందు ఇచ్చి దానిని సజీవంగా పట్టుకోవడమే మా లక్ష్యం. ఉదయం ఆ ప్రాంతంలోని ఒక ఇంటి దగ్గర అది కనిపించడంతో మేము మా ప్రాణాలను పణంగా పెట్టి మిషన్ కోసం వెళ్ళాం. అది ఒక కుక్క, రెండు-మూడు కుక్కపిల్లలు, ఒక ఆవు దూడను చంపింది. అయితే పులికి కేవలం 15 మీటర్ల దూరంలో నిలబడి ట్రాంక్విలైజర్ షాట్‌ను పేల్చాం. పులి జనావాస ప్రాంతంలో కనిపించడం వల్లనే మేము ఆ సాహసం చేసాం. అనూహ్యంగా అది మాపై దాడి చేయడంతో మమ్మల్ని రక్షించుకోవడానికి దానిని కాల్చడం తప్ప మాకు వేరే మార్గం కనిపించలేదు’ అని ఆయన అన్నారు. చనిపోయిన పులి వయస్సు 10 సంవత్సరాలు ఉంటాయని అటవీ శాఖ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.