

ప్రస్తుత రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా మందిని బాధిస్తోంది. మన దేశంలో దాదాపు 42 మిలియన్ల మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇది హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఏర్పడే సమస్య. హార్మోన్లు అధికంగా లేదా తక్కువగా ఉత్పత్తి కావడంతో బరువు పెరగడం, జుట్టు రాలడం, అలసట, ఇతర శారీరక సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని సహజ ఆహార పదార్థాలు థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
థైరాయిడ్ గ్రంధి పని తీరుపై ప్రభావం
థైరాయిడ్ గ్రంధి మెడ భాగంలో ఉంది. ఇది శరీర శక్తిని వినియోగించడం, మెదడు, గుండె, ఇతర అవయవాలు సక్రమంగా పనిచేయడం కోసం హార్మోన్లను విడుదల చేస్తుంది. కానీ ఈ గ్రంధిలో అసమతుల్యత ఏర్పడితే హైపో థైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు వస్తాయి. హైపర్ థైరాయిడిజంలో హార్మోన్లు అధికంగా విడుదల అవుతాయి. ఇది గుండె దడ, బరువు తగ్గడం, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలకు దారితీస్తుంది. హైపో థైరాయిడిజంలో హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల బరువు పెరగడం, నీరసంగా కనిపించడం వంటి సమస్యలు వస్తాయి.
ఉసిరితో థైరాయిడ్ సమస్యకు చెక్
ఉసిరిలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉసిరిని పచ్చడి, తేనెతో కలిపి తీసుకోవడం మంచిది.
బ్రెజిల్ బీట్స్
బ్రెజిల్ బీట్స్లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. రోజూ మూడూ బ్రెజిల్ బీట్స్ తింటే థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది.
గుమ్మడి గింజలు
ఇవి మెగ్నీషియం, జింక్ పుష్కలంగా కలిగి ఉంటాయి. జింక్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణలో సహాయపడుతుంది.
కొబ్బరి
పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి నూనె జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిజరైడ్లు ఉంటాయి. ఇవి శరీర శక్తిని సమతుల్యం చేస్తాయి.
పెసరలు
పెసరలు ప్రోటీన్లు, అయోడిన్ పుష్కలంగా కలిగి ఉంటాయి. అయోడిన్ థైరాయిడ్ గ్రంధి మెరుగైన పనితీరుకు అవసరం. పెసరలు తినడం జీవక్రియ రేటు పెరగడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారాలు
శనగలు, ఆవు పాలు, మజ్జిగ, ఆకు కూరలు, బెర్రీలు వంటివి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యల తీవ్రత తగ్గవచ్చు. పరిమిత ఆహారపు అలవాట్లతో పాటు, వ్యాయామం, యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి థైరాయిడ్ సమస్యల్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.