
పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టను కోల్పోతుందా? తాజాగా జరిగిన “ది హండ్రెడ్” డ్రాఫ్ట్‌లో ఇది స్పష్టమైంది. మొత్తం 50 మంది పాకిస్తాన్ క్రికెటర్లు – 45 మంది పురుషులు, 5 మంది మహిళలు ఏ ఒక్క ఫ్రాంచైజీ ద్వారా ఎంపిక చేయబడలేదు. ఇది ఆ దేశ ఆటగాళ్లకు నిరాశ మిగిల్చింది. మహిళా క్రికెటర్ల విభాగంలో అలియా రియాజ్, ఫాతిమా సనా, యుస్రా అమీర్, ఇరామ్ జావేద్, జవేరియా రౌఫ్‌లకు ఎలాంటి అవకాశాలు రాలేదు. ఇక పురుషుల విభాగంలో ప్రముఖ క్రికెటర్లు ఇమాద్ వసీం, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ కూడా చోటు దక్కించుకోలేదు. అయితే, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా మాత్రం అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు.
ఇతర దేశాల క్రికెటర్లకు మాత్రం హండ్రెడ్ డ్రాఫ్ట్‌లో మంచి అవకాశాలు దక్కాయి. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ లాంటి ఆటగాళ్లు మంచి ఒప్పందాలను పొందారు. నూర్ మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో చేరగా, బ్రేస్‌వెల్‌ను సదరన్ బ్రేవ్ కొనుగోలు చేసింది. అదే సమయంలో, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను లండన్ స్పిరిట్ తమ జట్టులోకి తీసుకుంది.
ఇక, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందనే వార్తలు బయటకొస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో దేశీయ క్రికెట్లోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
PCB నిర్ణయం మేరకు, రాబోయే నేషనల్ T20 ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును మ్యాచ్‌కు 100,000 రూపాయల నుంచి కేవలం 10,000 రూపాయలకు తగ్గించింది. రిజర్వ్ ప్లేయర్లకు అయితే, ఒక్క మ్యాచ్‌కు కేవలం 5000 రూపాయల మాత్రమే ఇస్తారు. ఈ టోర్నమెంట్ మార్చి 14న ప్రారంభం కానుంది.
ఈ ఫీజు కోతలు ఆటగాళ్లలో ఆందోళన రేకెత్తించాయి. అంతేకాకుండా, దేశీయ క్రికెట్ అభివృద్ధికి ఖర్చు చేయడాన్ని PCB తగ్గించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మూలాల ప్రకారం, PCBలో దేశీయ క్రికెట్ అధిపతి అబ్దుల్లా ఖుర్రం నియాజీ గత కొంతకాలంగా దేశీయ ఆటగాళ్లకు అందుతున్న సదుపాయాలను తగ్గిస్తున్నట్లు సమాచారం.
ఒకప్పటి లగ్జరీ హోటళ్ల బదులుగా, ఇప్పుడు ఆటగాళ్లకు సాదాసీదా వసతులు కల్పిస్తున్నారు. అంతేకాకుండా, విమాన ప్రయాణ సౌకర్యాలను కూడా తగ్గించేశారు. ఆటగాళ్ల ఫీజులు తగ్గించడమే కాకుండా, గత సీజన్‌లోని పెండింగ్ చెల్లింపులు కూడా ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు.
అదనంగా, PCB విధానం ప్రకారం మాజీ టెస్ట్ క్రికెటర్లకు వర్తించాల్సిన వార్షిక పెన్షన్ పెంపును కూడా బోర్డు ఇంకా అమలు చేయలేదు. ఈ పరిస్థితులు పాకిస్తాన్ క్రికెట్లో ఆర్థిక ఇబ్బందులున్నాయని స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..