
ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలు ప్రైవేట్ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్ర్పచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఎలక్ట్రిక్ బస్సుల మెయిన్టనెన్స్, చార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలకు సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోంది. అన్ని డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా ఇతర బస్సుల ఆపరేషన్స్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈవీ పాలసీ ప్రకారం హైదరాబాద్ తో సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ రూట్లలో ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ తిప్పుతోంది.
కేంద్రప్రభుత్వ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుపాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్)-1 స్కీమ్‌లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన ప్రవేశపెట్టింది. పుష్ఫక్ పేరుతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో ఈ బస్సులను సంస్థ నడుపుతోంది. ఆ బస్సుల మెయిన్టనెన్స్, చార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.
2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం(ఎన్‌ఈబీపీ) కింద 550 ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులకు, 500 సిటీ బస్సులకు సొంత టెండర్ ద్వారా ఆర్డర్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది. వాటిలో 170 సిటీ, 183 జిల్లాల బస్సులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ సంస్థల జాప్యం వల్ల మిగతా ఎలక్ట్రిక్ బస్సులు రావడంలో ఆలస్యం జరుగుతోంది. మిగిలిన బస్సులు ఈ ఏడాది మే నెల వరకు సంస్థకు అందజేస్తామని ప్రైవేట్ సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు డిపోలతో పాటు వరంగల్-2, కరీంనగర్-2, నిజామాబాద్-2 డిపోల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని టీజీఎస్ఆర్టీసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంలో దేశవ్యాప్తంగా అవలంభిస్తోన్న ఈవీ పాలసీనే 2019 నుంచి టీజీఎస్ఆర్టీసీ అమలు చేస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులను నేరుగా కొనాలంటే వ్యయంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ మేరకు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన అంటే బస్సు తిరిగే కిలోమీటర్ల ప్రకారం కంపెనీలకు చెల్లింపులు చేయడం జరుగుతుందని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
ప్రతి డిపో పరిధిలో రూరల్, అర్బన్, తదితర భిన్నమైన రూట్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదు. ఎలక్ట్రిక్ బస్సులు తిరిగే కిలోమీటర్ల సామర్థ్యాన్ని బట్టి రూట్లను సంస్థ గుర్తిస్తుంది. ప్రతి డిపోలోనూ ఎలక్ట్రిక్, డీజిల్ మిశ్రమం ఉంటుంది. ప్రైవేట్ అద్దె బస్సుల మాదిరిగానే ఎలక్ట్రిక్ బస్సులన్నీ టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఆ బస్సుల ద్వారా వచ్చే టికెట్ ఆదాయం నేరుగా సంస్థకే వస్తోంది. ఒప్పందం ప్రకారం తిరిగిన కిలోమీటర్ల లెక్కన కంపెనీలకు నగదును చెల్లిస్తుందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.
సంస్థలో కొత్త బస్సుల కొనుగోలు జరగడం లేదనడంలో వాస్తవం లేదన్న టీజీఎస్ఆర్టీసీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 2,500 కొత్త బస్సులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని, ఖాళీగా ఉన్న 3,038 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని తెలిపింది. అందులో 2 వేల డ్రైవర్ పోస్టులున్నాయి. పోలీస్ నియామక మండలి, టీజీపీఎస్సీ, తదితర సంస్థల ద్వారా త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ తన నివేదికను ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించవల్సి ఉంది. దీని ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదిలావుంటే, ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ఈ ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజ్ఞప్తి చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..