
హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్ధులకు దెబ్బమీద దెబ్బ పడుతుంది. సర్కార్ జారీ చేసిన జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ కొందరు గ్రూప్ 1 అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని రద్దు చేయాలని కోరుతూ పలువురు గ్రూప్1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ కొట్టివేయంతో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లైంది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్1 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేయగా.. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిపికేషన్కు అభ్యర్ధులను పిలవనున్నారు.
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 దరఖాస్తు సవరణకు ఛాన్స్
ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (NCET) దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించగా.. ఏప్రిల్ 3వ తేదీతో దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకోవడానికి గడువు ముగిసింది. 13 భాషల్లో ఆన్లైన్ విధానంలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP)లో ఐఐటీ, ఎన్ఐటీ, ఆర్ఐఈలు, ప్రభుత్వ కళాశాలలతో సహా మొదలైన వాటిలో ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 6,100 సీట్లలో ఐటీఈపీ ప్రోగ్రామ్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సు సీట్లను భర్తీ చేస్తారు. రాత పరీక్ష ఏప్రిల్ 29న నిర్వహిస్తారు.
ఏపీఆర్డీసీ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీఆర్డీసీ సెట్-2025) దరఖాస్తు గడువును ఏపీఆర్ఈఐ పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. 2025-2026 విద్యా సంత్సరానికి ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి 2025 మార్చి 31తో ఆన్లైన్ దరఖాస్తుల గడువు పూర్తవగా.. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.