
హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధులకు మరో రెండు, మూడు రోజుల్లో ఫలితాలు వెడువడనున్నాయి. ఈ మేరక విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈసారి టెన్త్ మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులతోపాటు గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 8న పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. దాదాపు 20 రోజుల వరకు నిర్ణయించింది ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో పదో తరగతిలో సబ్జెక్టులవారీగా గ్రేడ్లు ఇచ్చేవారు. అలాగే ఆయ సబ్జెక్టులకు క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ) ఇచ్చేవారు.
ఈ ఏడాది నుంచి (2025) ఇలా గ్రేడ్లకు బదులు సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తారన్నమాట. సీజీపీఏ మార్కుల మెమోలపై ఇక కనిపించవు. మార్కులమెమోలపై సబ్జెక్టులవారీగా.. రాత పరీక్షలు, ఇంటర్నల్ మార్కులు, వచ్చిన మొత్తం మార్కులు, అందుకు సంబంధించిన గ్రేడ్లతోపాటు పాస్, ఫెయిల్ అని కూడా ముద్రించనున్నారు. కో కరిక్యులర్ యాక్టివిటీస్‌లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించి గ్రేడ్లు కూడా మార్కుల మెమోలపై ముద్రిస్తారు.
నిజానికి, మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగగా.. ఏప్రిల్ 15వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తైంది. కానీ మెమోలపై మార్కుల విషయం గురించి ప్రభుత్వం నుంచి క్లారిటీ రాకపోవడంతో జాప్యం నెలకొంది. తాజాగా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వడంతో టెన్త్ ఫలితాల విడుదలకు అడ్డంకి తొలగినట్లైంది. మరోవైపు ఇప్పటివరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా కొనసాగిన ఈవీ నరసింహారెడ్డి బదిలీ అవడంతో ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. కొత్త అధికారి లేకుండా విడుదల సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఈ నెలాకరుకి ఫలితాలు విడుదల చేస్తారా? లేదంటే పాఠశాల విద్యాశాఖ కొత్త డైరెక్టర్ని నియమించిన తర్వాత విడుదల చేస్తారా? అనే విషయం ఇంకా కొలిక్కిరాలేదు. దీంతో ఫలితాల విడుదల మరికాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యగ వార్తల కోసం క్లిక్ చేయండి.