
ఈ నెల 29న శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి, మే 25న గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారడం జరుగుతుంది. ఫలితంగా మార్చి 29 నుంచి మే 25 వరకు 56 రోజుల సమయం కొన్ని రాశుల వారికి అత్యంత కీలకం కాబోతోంది. శని మారడం వల్ల కలిగే శుభ యోగాలు, శుభ ఫలితాలు గురువు రాశి మారిన తర్వాత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అందువల్ల మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభ రాశులకు ఆదాయపరంగా, ఉద్యోగ పరంగా ఈ సమయం అత్యంత కీలకం కాబోతోంది. ఈ రాశుల వారు దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకునే చందంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
- మిథునం: ఈ రాశికి శని దశమ స్థానంలోకి, గురువు ఇదే రాశిలోకి మారుతున్నందువల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కెరీర్ మీద బాగా శ్రద్ధ పెట్టడం, ఏవైనా సమస్యలున్న పక్షంలో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం మంచిది. వ్యాపార వృద్ధికి చర్యలు చేపట్టడానికి వెనువెంటనే ప్రయత్నాలు సాగించక తప్పదు. నిరుద్యోగులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
- కర్కాటకం: ఈ రాశివారికి శని మార్పు వల్ల అష్టమ శని దోషం తొలగిపోతుంది. అయితే, ఈ రాశికి అత్యంత శుభుడు, ధన కారకుడు అయిన గురువు వ్యయ స్థానంలో ప్రవేశించడం వల్ల చేతిలో డబ్బు మిగిలే అవకాశం ఉండదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. ప్రస్తుతం సంపాదిస్తున్న ఆదాయాన్ని పెట్టుబడులు పెట్టడం, ఫిక్సెడ్ డిపాజిట్లు చేయడం, ఆస్తులు కొనడం, షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
- వృశ్చికం: శని మార్పుతో ఈ రాశికి అర్ధాష్టమ శని దోషం తొలగిపోతోంది. ఫలితంగా ఉద్యోగ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే, గురువు అష్టమ స్థానంలోకి మారు తున్నందువల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. చేతిలో డబ్బు మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత ఆదాయాన్ని వీలైనన్ని మార్గాల్లో భద్రపరచుకోవడం, భారీగా మదుపు చేయడం మంచిది.
- ధనుస్సు: శని రాశి మార్పుతో ఈ రాశికి అర్దాష్టమ శని ప్రారంభం అవుతుంది. దీని వల్ల ఉద్యోగంలోనే కాక, కుటుంబంలోనూ సమస్యలు తలెత్తుతాయి. ఆస్తి వివాదాలు కూడా ప్రారంభం కావచ్చు. వీటి మీద మరింత శ్రద్ధ పెట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. గురువు సప్తమ స్థానంలోకి మారడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. సంతాన యోగం కలుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- మకరం: ఈ రాశికి మార్చి 29తో ఏలిన్నాటి శని దోషం నుంచి విముక్తి లభించి ఉద్యోగపరంగా అంచనాలకు మించిన పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. గురువు ఆరవ స్థానంలోకి మారుతున్నందు వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుత సంపాదనను ఎంత వీలైతే అంత జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఉచిత సహాయాలకు, వృథా ఖర్చులకు స్వస్తి చెప్పి, షేర్లు, స్పెక్యులేషన్ల మీద మదుపు చేయడం ఉత్తమం.
- కుంభం: ఈ రాశికి మార్చి 29న శని ధన స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల చేతిలో డబ్బు మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. మొండి బాకీలు పెరుగుతాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యో గంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పంచమ స్థానంలోకి గురువు ప్రవేశంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈ లోగా ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండడంతో పాటు ఆదాయాన్ని సక్రమంగా మదుపు చేసుకోవడం మంచిది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం అవసరం.