
తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖలో స్లాట్ విధానం విజయవంతంగా అమలు కావడంతో సేవల వేగం పెరిగింది. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారం ప్రారంభించిన స్లాట్ విధానంలో మొదటి రోజే 626 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. సాధారణంగా గంటన్నర పడే ప్రక్రియ, కొత్త విధానంలో అరగంటలో ముగిసింది. కొంతమందికి ఇది పది నిమిషాల్లోనే పూర్తవ్వడం గమనార్హం.
పాత విధానంలో చివరిదశలో డాక్యుమెంట్లలో పొరపాట్లు బయటపడడంతో రిజిస్ట్రేషన్ తిరస్కరణకు గురయ్యే వాతావరణం ఉండేది. కానీ స్లాట్ విధానం వల్ల ఈ సమస్యలు తగ్గాయి. వినియోగదారులు ముందుగానే registration.telangana.gov.in వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, కేటాయించిన సమయానికి కార్యాలయానికి హాజరై దస్తావేజులను సమర్పించి రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. వినియోగదారుల నుండి మంచి స్పందన వచ్చింది.
ఏఐ సాంకేతికతతో రెండు కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు..
సరూర్‌నగర్, చంపాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏఐ ఆధారిత రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. సరూర్‌నగర్‌లో 23, చంపాపేటలో 15 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో కొన్నింటి ప్రాంతాలు పరస్పరం మారిపోవడం గమనార్హం. వినియోగదారుల సమాచారం ఆధారంగా ఏఐ తగిన కార్యాలయాన్ని కేటాయించింది.
దళార్లకు అడ్డుకట్ట.. అవినీతి నియంత్రణ
స్లాట్ విధానం ద్వారా దళార్ల మోసాలకు, అవినీతికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అవసరమైతే అధిక రిజిస్ట్రేషన్లు ఉండే కేంద్రాల్లో సిబ్బంది సంఖ్యను పెంచి స్లాట్ల సంఖ్యను కూడా పెంచుతున్నారు.
సమయానికి రాకపోతే.. మరో అవకాశం
కొంతమంది వినియోగదారులు తమ డాక్యుమెంట్ల వివరాలను సరిగా నమోదు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. అయితే వారికి మరో అవకాశం ఇచ్చి, ఆ రోజు లోపే ప్రక్రియను పూర్తి చేశారు.
నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్ లేదు
ఇకపై ప్రభుత్వ భూములపై రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు. స్లాట్ బుకింగ్ సమయంలోనే సంబంధిత స్థలం నిషేధిత జాబితాలో ఉందా లేదా అనేది సిస్టమ్ గుర్తిస్తుంది. నిషేధిత భూములపై తప్పుగా నమోదు జరిగితే, రెవెన్యూ శాఖ నుండి ఎన్వోసీ వచ్చినపుడే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..