రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో 189 మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. అదేవిధంగా 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది పోటీ పడుతుండగా.. 27,628 వార్డు స్థానాల్లో 65,455 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తొలి విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఓట్ల లెక్కింపు..
మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను వెంటనే వెల్లడిస్తారు. సాయంత్రంలోపే ఉప సర్పంచ్ల ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 93,905 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు
