
Telangana Budget 2025 Live Updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ప్రస్తుత ఏడాది బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది పద్దు రూ. 3 లక్షల కోట్లు దాటనుంది. మార్చి 19 ఉదయం 11 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఐటీ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఓటాన్అకౌంట్ బడ్జెట్‌ను మూడు నెలల కాలానికి ప్రవేశపెట్టింది.ఇక 2024 జులై 25న మిగిలిన 9 నెలల కోసం రూ.2.90 లక్షల కోట్లతో పూర్తి పద్దును సభలో ప్రవేశపెట్టింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆసారే ప్రవేశపెట్టబోతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు అధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. దీంతో పాటుగా.. వ్యవసాయం, నీటిపారుదల, విద్య, రోడ్లు-భవనాలు, ఇంధన శాఖలకు, గృహనిర్మాణం అత్యధికంగా నిధులు దక్కనున్నాయి.